- మారుమూల గ్రామాలకు రానీ పల్లె వెలుగు బస్సులు
- నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అర్టీసీ అధికారులు
తూప్రాన్: మెదక్ జిల్లా ఎస్ఎఫ్ఐ (స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) సభ్యులు జగన్, కళాశాల సమయానికి బస్సులు నడిపించాలని డిమాండ్ చేశారు. తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన 50 మంది విద్యార్థులు, తూప్రాన్ పట్టణంలోని పలు కళాశాలల్లో చదువుతున్నారని తెలిపారు.
విద్యార్థులు, కళాశాలలకు వెళ్లాలంటే సమయానికి బస్సులు రాకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉదయం 9:00 గంటలకు కళాశాల ప్రారంభమవ్వడంతో బస్సులు 10:30 గంటలకు వస్తున్నాయని తెలిపారు. సమయానికి కళాశాలకు చేరుకోలేకపోతున్న విద్యార్థులను యాజమాన్యం మందలిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
ఈ సమస్యపై ప్రతిస్పందిస్తూ, మంగళవారం ఉదయం విద్యార్థులతో కలిసి ఘనపూర్ గేటు దగ్గర ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాస్తారోకో మరియు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా, “ప్రతి రోజు కళాశాల సమయానికి బస్సులు నడపాలి” అనే నినాదాలు చేశారు.
వెంటనే ఆర్టీసీ అధికారులు స్పందించి బస్సులు నడిపాలని వారు డిమాండ్ చేశారు. ఇక్కడితోనే కాకుండా, ఆర్టీసీ అధికారులు స్పందించక పోతే నిరవధిక దీక్షలను చేపడతామని హెచ్చరించారు. “ఇప్పటికైన బస్సులు సమయానికి నడపాలి” అని జగన్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఘనపూర్ మరియు యావపూర్ గ్రామాల విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల సమస్యలు సమర్థంగా పరిష్కరించబడాలని, తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.