మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా దగ్గర బైక్ పై ప్రయాణిస్తున్న యువకుడిపై టిప్పర్ దూసుకెళ్లిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. టిప్పర్ లోడ్‌తో వెళ్ళే సమయంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడం, ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వలన ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెప్తున్నారు.
గతంలో కూడా పెట్రోల్ పంప్ వద్ద ఇటువంటి ప్రమాదాలు బారిన పడి ఎంతోమంటి యువకులు ప్రాణాలు కోల్పోయారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు మాత్రం కన్పించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అయితే, రోజువారీగా చలాన్లు వేయడం, వాటిని వసూలు చేయడమే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసులు పనిచేస్తున్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కంటే, చలాన్లు వసూలు చేసే పనిలోనే ఎక్కువ మంది సిబ్బంది పనిచేస్తున్నారు. స్థానికుల ప్రాణాలు పోతున్న పట్టించుకునే నాధుడే లేడు.
మమ్మల్ని ఎవరు అడుగుతారనే భావనతో ట్రాఫిక్‌పై దృష్టి కూడా పెట్టడం లేదనే విమర్శలున్నాయి. ఇలా, ట్రాఫిక్‌లో చాలా మంది క్షేత్ర స్థాయిలో ఉంటూ ఎప్పకటిప్పుడు సమస్యలను పరిశీలిస్తూ పనిచేయాల్సి ఉండగా, మననెవరు అడుగుతారు? అనే ధీమాతో రోడ్లపైకి కూడా రాకుండా పనిచేస్తుండటంతో నగర వాసులు ప్రాణాలు కోల్పోతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రమాదంలో క్షతగాత్రుడు తీవ్రంగా గాయపడినందున పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూడాలి.