- బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ
- కమిషనర్ కు వినతి పత్రం అందజేత
మెదక్ జిల్లా తూప్రాన్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కొత్త చైర్మన్ కొలువుదీరిన వెను వెంటనే తూప్రాన్ మున్సిపల్ పరిధిలో అడ్డగొలుగా విపరీతంగా ఇంటి పన్ను, వాణిజ్య భావణాల పన్ను పెంచి యాజమానుల నడ్డి విరుస్తున్నారని తూప్రాన్ మున్సిపల్ మాజీ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ ఆరోపించారు. మంగళవారం తూప్రాన్ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు రవీందర్ గౌడ్ నాయకత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ఖాజా మొహిజిద్దిన్ కు తన ఛాంబర్ లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బొంది రవీందర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టించి కొత్త చైర్మన్ కొలువుదీరిన వెను వెంటనే తూప్రాన్ మున్సిపల్ పరిధిలో ఒకే సారి 500 రూపాయల ఇంటిపన్ను ఉన్న స్థానం లో ఏకంగా 15 వేల రూపాయలు టాక్స్ పెంచి భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆరోపించారు. కొత్త మున్సిపల్ ఏర్పాటు అయిన తర్వాత 5 ఏళ్ల వరకు పన్నులు పెంచకుండా సడలింపు ఇచ్చారనీ, అలాంటి నిబంధన తుంగ లో తొక్కి కొత్త బిచ్చగాడు పొద్దెరుగడు మాపు ఎరుగడని పాత ఇళ్లకు కని విని ఎరుగని రీతిలో మూడువందల శాతం నుంచి ఐదు వందల శాతం ట్యాక్సీ పెంచి సామాన్య మధ్యతరగతి ఇంటి యాజమానుల నడ్డి విరిచే ప్రయత్నం మానుకోవాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా తూప్రాన్ మున్సిపల్ ప్రజల అవసర నిమిత్తం మిని స్టేడియం నిర్మించాలని డిమాండ్ చేశారు. స్టేడియం కోసం మంజూరైన నిధులు పక్కదారి మళ్లించి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తమ హయాంలో స్టేడియం నిర్మించాలని తీర్మానించి నిధులు మంజూరు చేయిస్తే కొత్త చైర్మన్ నిధులు దారి మళ్లించి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తక్షణమే పెంచిన ఇంటి పన్ను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ తో పాటు కౌన్సిలర్ లు బొంది అరుణ వెంకట్ గౌడ్, భైరం ఉమా సత్య లింగం, తలారి పద్మా మల్లేష్, లావణ్య దుర్గారెడ్డి, బి.అర్.ఎస్ నాయకులు ఎస్.కే. సత్తార్, యూత్ లీడర్ శ్రీకాంత్ చారి, ఆంజనేయులు, నాగేందర్ రెడ్డి, నర్సింగ్ రావు, కిషన్, ప్రవీణ్ రెడ్డి, లంబ రాజు యాదవ్, మల్లేష్ యాదవ్, భావని అంజయ్య యాదవ్ కాయితీ బాపని మాల్దార్ శివ, దేవ తో పాటు తూప్రాన్, అల్లాపూర్, రావెల్లి, పోతారాజ్ పల్లి, పడాలపల్లి, బ్రాహ్మణ పల్లి, వేంకటాపూర్ గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు.