సంగారెడ్డి : ‘ఆత్మీయ సమ్మేళనాల’ పేరుతో కార్యకర్తల మనోభావాలు తెలుసుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల ఆత్మఘోషలు కూడా వినాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్ మున్సిపాలిటీ అస్తవ్యస్త పాలన గురించి, అవినీతి, అలసత్వ వైఖరి గురించి, పారదర్శకత లేని, జవాబుదారితనం లేని నియంతృత్వానికి వ్యతిరేకంగా తూప్రాన్ ప్రజలు స్వచ్ఛందంగా మొదలుపెట్టిన ఆత్మఘోష దీక్ష. తూప్రాన్ ప్రజల సమస్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్లే వరకు, సమస్యలు పరిష్కారం అయ్యేవరకు కొనసాగుతుంది. రూపాలు వేరు వేరు అయినా దీక్ష స్వరూపం, స్వభావం మాత్రం ఒక్కటే… తూప్రాన్ విముక్తి. సుపరిపాలనకు తూప్రాన్ ఒక ఉదాహరణగా మారాల్సిన అవసరం ఉంది. ఒక్క అవినీతి చర్య కూడా జరగకుండా జవాబుదారీతనం, పారదర్శకత, నీతివంతమైన పరిపాలన ప్రజలకు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు సామాజిక కార్యకర్త కే శ్రీనివాసాచారి అయిన నేను ఈ దీక్షను ఒక్కడిగా ప్రారంభం చేశాను. ఇది క్రమక్రమంగా తూప్రాన్ లోని ప్రతి పౌరుడికి స్ఫూర్తిగా నిలుస్తుందని భావిస్తున్నాను. ప్రజల్లోతమ హక్కుల పట్ల, తమ ఆత్మ గౌరవం పట్ల, తమ బాధ్యతల పట్ల, తమకు ఉన్న సమస్యల పరిష్కారంలో ఏ కొంతమందిని కదిలించినా, స్ఫూర్తి రగిలించినా నా ఈ చిన్న ప్రయత్నం ఫలించినట్టే. నేటి “తూప్రాన్ ప్రజల ఆత్మఘోష” అనే చిన్న మొదటి అడుగు రేపు తెలంగాణ అంతటా “తెలంగాణ ఆత్మఘోష” గా విస్తరిస్తుంది. ఆలోపే తప్పులను, పొరపాట్లను సరిదిద్దుకోవాల్సిన అవసరాన్ని ఆత్మఘోష దీక్ష గుర్తుచేస్తుంది.