- మైన్ రాష్ట్రంలోని లెవిస్టన్ నగరంలో బుధవారం రాత్రి ఘటన
- ఓ బౌలింగ్ యాలీ, మరో బార్ అండ్ రెస్టారెంట్‌లో ఆగంతుకుడి కాల్పులు
- సెమీ ఆటోమేటిక్ ఆయుధంతో కాల్పులకు తెగబడటంతో 22 మంది మృత్యువాత
- నిందితుడి కోసం పోలీసుల విస్తృత గాలింపు
అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. మైన్ రాష్ట్రంలోని లెవిస్టన్ నగరంలో బుధవారం రాత్రి ఓ ఆగంతుకుడు కాల్పులకు తెగబడటంతో 22 మంది దుర్మరణం చెందారు. సెమీ ఆటోమేటిక్ తుపాకీతో నిందితుడు ఓ బౌలింగ్ యాలీ, మరో రెస్టారెంట్‌లో విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. స్థానిక మీడియా కథనాల ప్రకారం ఈ ఘటనలో మరో 60 మంది గాయాల పాలయ్యారు.
ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అతడి ఫొటోను కూడా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఆ ప్రాంతంలోని వ్యాపారాలను మూసేయాలని పోలీసులు స్థానికులకు సూచించారు. కాగా, ఈ దారుణంపై మెయిన్ చట్టసభ సభ్యుడు జేరెడ్ గోల్డెన్ ‘ఎక్స్’ వేదికగా విచారం వ్యక్తం చేశారు. తాను భయభ్రాంతులకు లోనైనట్టు చెప్పుకొచ్చారు.