గన్నవరం: వైసీపీ సీనియర్ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం దగ్గరలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి ఘటనలో ఆయనను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తుండగా వాహనాన్ని అనుసరించి అదుపులోకి తీసుకున్నారు. వంశీ ఇంటికి సమీపంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ నుంచి వేర్వేరు కార్లలో గన్నవరం వస్తు్న్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆయనను పోలీసులు ట్రాక్ చేశారు. వంశీ వేరే మొబైల్ నంబర్ ఉపయోగిస్తున్నాడని పోలీసులకు తెలిసిపోయింది. దీంతో వంశీ వాహనాన్ని పోలీసులు గమనించారు. వాహనాన్ని అనుసరించి ఇంటికి సమీపంలోనే అరెస్ట్ చేశారు.
కాగా గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వల్లభనేని వంశీ ఏ71గా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో చాలా మంది దాడికి ప్రోద్బలం ఇచ్చింది వల్లభనేని వంశీయేనని వాంగ్మూలం ఇచ్చారు. దీంతో వంశీని ఈ కేసులో ఏ1గా మార్చాలని పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయనని అరెస్ట్ చేశారు.
ఏ1గా మార్చుతారా?
కాగా ఈ రోజు వంశీ హైదరాబాద్‌లో లేరని, అమెరికా వెళ్లిపోయారంటూ ప్రచారం జరిగింది. అయితే పోలీసులు మాత్రం ఆయన జాడను పసిగట్టారు. గన్నవరం సమీపంలో అరెస్ట్ చేశారు. మరికొద్ది సేపట్లోనే ఆయన వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటివరకు 21 మందిని అరెస్ట్ చేయగా వారందరినీ రిమాండ్‌కు తరలించారు. ఇక ఈ కేసులో వంశీని ఏ1గా మార్చుతారా? లేక ఏ71గానే కొనసాగిస్తారా? అనేది పోలీసులు తేల్చాల్సి ఉంది. ఒకవేళ ఏ1గా పెడితే కోర్టులో మళ్లీ కొత్తగా మెమో ఇవ్వాల్సి ఉంది. లేని పక్షంలో ఆయనను ఏ71గానే చూపించే అవకాశం ఉంటుంది. కాగా వల్లభనేని వంశీ అరెస్టును పోలీసులు ధృవీకరించడం లేదు. ఎందుకంటే.. వంశీని వెంటనే కోర్టులో హాజరు పరచాలంటూ ఆయన లాయర్లు వచ్చి డిమాండ్ చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.