ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టును ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో దశాబ్దాల రైతుల కల నెరవేరిందని సీఎం అన్నారు. తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. మహానేత కొడుకుగా ఈ ప్రాజెక్టును తాను పూర్తి చేయడం ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని పేర్కొన్నారు.
వెలిగొండ ప్రాజెక్టు ఫ్లోరైడ్ , కరువు ప్రాంతాల ప్రజల దాహార్తిని తీరుస్తుందని సీఎం జగన్ అన్నారు. ప్రకాశం జిల్లాలోని 23 మండలాలకు, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని 5 మండలాలకు, వైఎస్ఆర్ కడప జిల్లాలోని 2 మండలాలకు తాగునీరు అందుతుందన్నారు. మొత్తం 15.25 లక్షల మందికి తాగునీటి కష్టాలు తీరతాయన్నారు. 4 లక్షల 47 ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం జగన్ వివరించారు.
ఒక్కో టన్నెల్ పొడవు 18 కిలోమీటర్లు ఉందని సీఎం తెలిపారు. ఈ రెండు టన్నెళ్లను తన హయాంలో పూర్తి చేశామన్నారు. 2021 జనవరి 13న ప్రాజెక్టు మొదటి సొరంగం పనులు పూర్తయ్యాయని తెలిపారు. తాజాగా రెండో సొరంగం పూర్తైయ్యిందని తెలిపారు. టెన్నెల్ లో ప్రయాణం చేయడం సంతోషాన్ని కలిగించిందన్నారు.
వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ కెపాసిటీ 3 వేల టీఎంసీలు. రెండో టన్నెల్ సామర్థ్యం 8,500 టీఎంసీలు. శ్రీశైలం ప్రాజెక్టులో 840 అడుగులు దాటగానే ఈ రెండు టన్నెల్ ద్వారా నల్లమల సాగర్ కు నీరు తీసురావచ్చు. జూలై- ఆగస్టులో నీళ్లు నింపే సమయానికి పునరావాస పనులు పూర్తి చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. అందుకోసం రూ. 1200 కోట్లు ఖర్చు చేస్తామని వివరించారు. వెలగొండ ప్రాజెక్టు వల్ల దర్శి, ఎర్రగొండపాలెం, కనిగిరి, గిద్దలూరు, ఆత్మకూరు, ఉదయగిరి, బద్వేలు నియోజకవర్గాలకు మేలు జరుగుతుందని తెలిపారు.