contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా ఎస్వీ వేద విజ్ఞానపీఠం అడుగులు

  • నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా ఎస్వీ వేద విజ్ఞానపీఠం అడుగులు
  • బ్ర‌హ్మోత్స‌వాల‌లో వేద విద్యార్థుల వేద ఘోష‌.
  • శ్రీ వేంకటేశ్వర వేదపాఠశాల చరిత్ర పై డి.ఆర్. ప్రత్యేక కథనం.

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం విధుల్లో వేదపరిరక్షణ ఒకటి. వేదాలను పరిరక్షించి విస్తృతంగా ప్రచారం చేసేందుకు, సమాజహితం కోసం వేదవిజ్ఞానాన్ని అందరికీ అందించేందుకు అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా తిరుమలలోని ధర్మగిరిలో ఏర్పాటుచేసిన శ్రీవేంకటేశ్వర వేద విజ్ఞానపీఠం 35 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో విద్యార్థులకు వేద విద్యను అందిస్తోంది. ఇక్కడ వేదం, ఆగమం, స్మార్థం, దివ్య ప్రబంధం కోర్సులను ఇప్పటివరకు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఉన్నత కోర్సులైన శాస్త్రాలు, దర్శనాలు, వేదాంగాలు, ధర్మశాస్త్రం, పురాణేతిహాసాలతో పాటు పరిశోధనలకు పెద్దపీట వేస్తూ నైపున్యాభివృద్ధి కేంద్రంగా ఎస్వీ వేద విజ్ఞానపీఠం అడుగులు వేస్తోంది.

సుదీర్ఘ చరిత్ర వేదపాఠశాల సొంతం

శ్రీవేంకటేశ్వర వేదపాఠశాలను 1884వ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటుచేసింది. 132 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గల పాఠశాలగా ఇది గుర్తింపు పొందింది. 1992వ సంవత్సరంలో తిరుమలలోని ధర్మగిరిలో వేద పాఠశాలను నిర్మించారు. ప్రస్తుతం ఇక్కడ 7 వేదశాఖలు, 5 ఆగమ శాఖలు, 4 స్మార్థ శాఖలు, ఒక దివ్యప్రబంధ శాఖ కలిపి మొత్తం 17 శాఖలున్నాయి. మొత్తం 535 మంది విద్యార్థులు, 48 మంది అధ్యాపకులు ఉన్నారు. 12 సంవత్సరాల కాలపరిమితి గల వేదశాఖల్లో ప్రవేశానికి 10 నుంచి 12 ఏళ్ల మధ్య వయసు ఉండి, ఐదో తరగతి ఉత్తీర్ణులై, ఉపనయనం పూర్తయిన వారు, 8 ఏళ్ల కాలపరిమితి గల ఆగమ, స్మార్థ, దివ్యప్రబంధ కోరుల్లో ప్రవేశానికి 12 నుంచి 14 ఏళ్లలోపు వయసుండి, ఏడో తరగతి ఉత్తీర్ణులైన, ఉపనయనం పూర్తయిన విద్యార్థులు అర్హులు. ప్రవేశం పొందిన విద్యార్థులకు భోజనం, వసతి, వస్త్రాలు, పుస్తకాలు ఉచితంగా అందజేస్తారు. అన్ని శాఖల విద్యార్థులకు సంస్కృతం బోధిస్తారు. వేద విద్యార్థులకు కోర్సు ప్రారంభంలో రూ.3 లక్షలు, ఆగమ, స్మార్థ, దివ్యప్రబంధం విద్యార్థులకు రూ.ఒక లక్ష డిపాజిట్‌ చేస్తారు. విజయవంతంగా కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఈ మొత్తాన్ని వడ్డీతో కలిపి అందజేస్తారు.

ప్రాక్టికల్‌ శిక్షణ – మాదిరి బ్ర‌హ్మోత్స‌వాల నిర్వ‌హ‌ణ‌

వేద పాఠశాలలో విద్యార్థుల దృష్టి అంతా అభ్యసనపైనే ఉండేలా రోజువారీ సమయాన్ని పెంచారు. నేర్చుకున్న పాఠ్యాంశాలను సాధన చేసేందుకు ఉదయం, మధ్యాహ్నం కలిపి నాలుగు గంటలు సమయం పెంచారు. అలాగే శారీరక, మానసిక వికాసం కోసం ప్రతిరోజూ క్రీడలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయుడిని నియమించారు. ఇక వీలైనప్పుడల్లా తిరుమల శ్రీవారికి జరిగే సేవలు, ఉత్సవాల్లో విద్యార్థులను భాగస్వాములను చేస్తూ వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. వీటితోపాటు ప్రతినెలా హోమాలు, కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు తదితర క్రతువులు, ఉత్సవాలు వేద విజ్ఞాన పీఠంలో నిర్వహిస్తూ విద్యార్థులకు ప్రాక్టికల్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. హాస్టల్లో జూనియర్‌, సీనియర్‌ విద్యార్థులకు వయసుల వారీగా వేరువేరుగా గదులు కేటాయించారు. విద్యార్థుల సమస్యలు ఏవైనా ఉంటే అప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించేందుకు వీలుగా పాఠశాలలో ఫిర్యాదు పెట్టెలను ఏర్పాటుచేశారు. ఆరుగురు ఉపాధ్యాయులు రాత్రివేళ కూడా హాస్టల్లో ఉంటూ విద్యార్థులకు సూచనలు, సలహాలు అందజేస్తున్నారు.

మెండుగా ఉపాధి అవకాశాలు

తిరుమల తిరుపతి దేవస్థానంలో పేరెన్నికగన్న అర్చకులందరూ ఈ పాఠశాలలోనే విద్యను అభ్యసించారు. వీరిలో సుందరవరద భట్టాచార్య, ఎన్‌.ఎ.కె.శ్రీనివాసాచార్య, శ్రీ పెద్దజీయర్‌స్వామి తదితరులు ఉన్నారు. ఇక్కడ చదువుకున్న ప‌లువురు విద్యార్థులు టిటిడిలో అర్చకులుగా ఉద్యోగాలు సాధించారు. అదేవిధంగా రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలు, మఠాల్లోనూ ఉపాధి అవకాశాలున్నాయి. ప‌లువురు విద్యార్థులు విదేశాల్లోని ఆలయాల్లోనూ అర్చకులుగా ఉపాధి పొందారు.

బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ క‌మిష‌న్‌ కితాబు

రాష్ట్ర బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ క‌మిష‌న్ ఛైర్మ‌న్ కేస‌లి అప్పారావు, స‌భ్యులు త్రిప‌ర్ణ ఆదిల‌క్ష్మి, ముడిమేల ల‌క్ష్మీదేవి ఇటీవల తిరుమ‌ల‌లోని వేద పాఠ‌శాల‌ను సందర్శించి కితాబిచ్చారు. వేద పాఠ‌శాల‌ విద్యార్థుల‌తో కమిషన్ ఛైర్మన్, సభ్యులు మాట్లాడారు. అక్క‌డి వ‌స‌తులు, త‌ర‌గ‌తి గ‌దులు, హాస్టల్ ను ప‌రిశీలించారు. ఇక్కడి గురువులు తమ తల్లిదండ్రుల లాగా చక్కగా చూసుకుంటున్నారని విద్యార్థులు కమిషన్ కు తెలిపారు. బాల‌ల‌కు ఒత్తిడి లేకుండా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూడిన విద్యను అందిస్తున్నారని కమిషన్ అభిప్రాయపడింది. విద్యాబోధన, వసతుల పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు వారు వేద విజ్ఞాన పీఠానికి ఒక ప్రశంసా పత్రాన్ని కూడా అందించారు.

బ్ర‌హ్మోత్స‌వాల‌లో వేద విద్యార్థుల వేద ఘోష‌

ప్ర‌తి ఏడాది తిరుమ‌ల‌లో జ‌రిగే శ్రీ‌వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌లో వేద విద్యార్ధుల‌కు ప్ర‌త్యేక స్థానాన్ని టీటీడీ క‌ల్పిస్తోంది. ఈ ఏడాది కూడా తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై జ‌రిగే ప‌లు పారాయ‌ణ కార్య‌క్ర‌మాల‌లో వేద విద్యార్థులు పాల్గొంటారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :