విజయవాడ: రాష్ట్ర డిజిపి ద్వారకా తిరుమలరావును మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డిజిపిని దుశ్శాలువతో సన్మానించి, జ్ఞాపికను బహూకరించారు. అనంతరం సమితి అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లి, డిజిపితో రాష్ట్రంలో యస్టీ, యస్సీ, బిసీ, మైనారిటీలపై ఎటువంటి దాడులు జరగకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో యస్సీ, యస్టీ, బిసీ, మైనార్టీలపై విపరీతమైన దాడులు జరిగాయని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొన్ని దాడులకు సంబంధించి కేసులు కూడా నమోదు చేయకుండా వైసిపి నాయకులు తమ వితండవాదాన్ని ప్రజలపై రుద్దాయని గుర్తు చేశారు. ఇదే క్రమంలో నేడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కులమతాలను అడ్డుపెట్టుకుని వైసిపి మత రాజకీయాలతో రాష్ట్రంలో అశాంతి వాతావరణం సృష్టించాలని భావిస్తోందని, ఇందుకు పోలీసు శాఖ తగు చర్యలు తీసుకోవాలని ఫారూఖ్ షిబ్లి డిమాండ్ చేశారు. అందుకు డిజిపి ద్వారకా తిరుమలరావు ఖచ్చితంగా శాంతి భద్రతల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని, సమితి సహకారం కూడా పోలీసు శాఖకు అవసరమని డిజిపి సూచించారు. ఈ కార్యక్రమంలో ఫారూఖ్ షిబ్లితో పాటు, టిడిపి నాయకులు వాహిద్, సమితి సభ్యులు మౌలానా హుస్సేన్ సాబ్, ఇఫ్తేఖార్ అహ్మద్, అబ్దుల్ గఫూర్, అన్వర్ పాల్గొన్నారు.