- విజయవాడలో వరద పరిస్థితి, పునరావాస కార్యక్రమాలు పర్యవేక్షించిన ప్రత్తిపాటి
- క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ బాధితులకు సాయం అందేలా చర్యలు
బుడమేరు ముంపుతో వరదల్లో చిక్కుకున్న విజయవాడ నగరంలో చిట్టచివరి బాధితుడికి కూడా ప్రభుత్వ సాయం అందిస్తామని, అదే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. ఇలాంటి కష్టసమయంలో చేతనయితే భుజంభుజం కలిపి పనిచేయాలి తప్ప పనిచేసే వారికి తప్పుడు విమర్శలు చేయడం మనిషన్న వాడికి సరికాదని మాజీ సీఎం జగన్ రెడ్డికి చురకలు వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మంగళవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో విజయవాడలో వరద పరిస్థితి, పునరావాస కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పర్యవేక్షించారు. స్థానిక 45వ డివిజన్ ఇన్‌ఛార్జిగా ప్రత్తిపాటిని సీఎం చంద్రబాబు నియమించారు. ఈ మేరకు విజయవాడ 45వ డివిజన్‌లోని సితార సెంటర్, జోజినగర్, కబేళా సెంటర్, రోటరీనగర్, ఏకలవ్య నగర్, బ్రహ్మయ్యనగర్, భగత్‌సింగ్ నగర్‌లో విస్తృతంగా పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు ప్రత్తిపాటి. సితార సెంటర్, జోజినగర్‌లో సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు సీఎం చంద్రబాబు వచ్చినప్పుడు దగ్గరుండి ఏర్పాట్లను వివరించారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వరద నీటిలో చిక్కుకున్న కుటుంబాలకు ఆహార పొట్లాలు అందేలా సమన్వయం చేస్తున్నారు. వరద బాధితులకు ఆహారం, తాగునీటి ప్యాకెట్లు అందుతున్న తీరుపై స్వయంగా పర్యవేక్షించారు. వరద బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. చిట్టచివరి బాధితుడికి కూడా ప్రభుత్వ సాయం అందిలా అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు జగన్‌రెడ్డి నిన్న హడావుడిగా వచ్చి మోకాళ్లోతు నీళ్లలో దిగి ప్రభుత్వంపై బురదజల్లడానికి వచ్చినట్లు ఉంది తప్ప కష్టాల్లో ఉన్న ప్రజలను, వరద బాధితులపై ఆయనకు ఏమాత్రం సానుభూతి ఉన్నట్లు కనిపించ లేదన్నారు. నిజానికి గత పాలకుల నిర్లక్ష్యమే ఈ వరద ముంపునకు ప్రధాన కారణం అని జగన్‌రెడ్డి డ్రైన్లు, కాల్వలను నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చిన వరద బయటకు వెళ్లకుండా విజయవాడను ముంచిందన్నారు. అలాంటిది ఇప్పుడుప్రభుత్వంపై బురదజల్లాలనే దురుద్దేశంతో హడావుడిగా బెంగళూరు నుంచి వచ్చి హడావుడి చేయడం జగన్‌కే చెల్లిందన్నారు. పైగా నిన్న మొన్నటి వరకు రెడ్‌కార్పెట్, గ్రీన్ కార్పెట్‌ల మీద తిరిగిన ఆయన ఇప్పుడే మొట్టమొదటిసారి నీళ్లలో దిగారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు నీళ్లలో దిగి ఫొటోలకు ఫోజులిచ్చిపోయారు తప్ప కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి సహాయ చర్యల్లో పాల్గొనాలని ఆ పార్టీ కార్యకర్తలకు కూడా పిలుపునిచ్చిన పాపానపోలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గత మూడ్రోజుల నుంచి విజయవాడ కలెక్టరేట్‌లోని ఉండి బాధితులను ఆదుకోవడంపై శ్రమిస్తున్నారన్నారు. బాధితులను ఎలా ఆదుకోవాలి.. వారికి అవసరమైన ఆహారం, నీళ్లు, పాలు, ఔషధాలు ఎలా పంపాలనే దాని పైనే యంత్రాంగం మొత్తాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారన్నారు. ఇవ న్నీ తెలిసీ చంద్రబాబు ఇంటి గురించి రాజకీయ విమర్శలు చేయడం చవకబారుతనం కంటే నీచంగా కనిపిస్తోందన్నారు. ఇప్పుడిప్పుడే ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి తగ్గుముఖం పడుతుందని, బుడమేరులో కూడా వరద తగ్గిందని, 24 గంటల్లో విజయవాడలో ముంపులో ఉన్న ప్రతిఒక్కరికీ ఆహారం, నీళ్లు, పాలు, ఔషధాలతో పాటు ఇతర సౌకర్యాలు ఎక్కడా లోటు లేకుండా కల్పిస్తామన్నారు. డివిజన్ల వారీగా పడవలు, ట్రాక్టర్ల ద్వారా బాధితులకు ఆహారం, మంచినీరు, పాలు, ఔషధాలు సరఫరా చేస్తున్నామన్నారు. ఎవరైనా అనారోగ్యంతో బాధ పడుతుంటే వారి కోసం ప్రత్యేకంగా బోటు ఏర్పాటు చేసి ఆస్పత్రికి తరలిస్తున్నామని చెప్పారు. ఆవిధంగా 24 గంటల్లోపు విజయవాడలో సాధారణ స్థితి నెలకొనే వరకు అధికార యంత్రాంగం మొత్తం బాధితుల పక్షాన, కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.