contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి

వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజవకర్గం లగచర్ల గ్రామంలో ఓ ఫార్మాసంస్థ భూసేకరణ కోసం చేపట్టిన ప్రజాభిప్రాయసేకరణ రణరంగంలా మారింది. గ్రామసభ నిర్వహించేందుకు రెవెన్యూ సిబ్బందితో కలిసి వచ్చిన కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌తో స్థానికులు వాగ్వాదానికి దిగారు. గ్రామసభను ఊరికి దూరంగా ఏర్పాటుచేయడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. గ్రామసభ వద్ద ఉన్న ఇద్దరు రైతుల అభ్యంతరంతో కలెక్టర్‌ లగచర్ల గ్రామానికి చర్చల కోసం వెళ్లారు.

కలెక్టర్‌ ఊర్లోగి రాగానే ఆయనకు వ్యతిరేకంగా అన్నదాతలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ వెనక్కి వెళ్లిపోవాలంటూ కారుపై రాళ్లు విసిరారు. కారు దిగి రైతులతో చర్చించేందుకు వచ్చిన కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ అన్నదాతలను ఒప్పించేందుకు ప్రయత్నించారు. సహనం కోల్పొయిన స్థానిక రైతులు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, తహశీల్దార్‌ కార్లపై రాళ్లు విసిరారు. పరిస్థితిని గమనించి అక్కడి నుంచి కలెక్టర్‌, రెవెన్యూ సిబ్బంది వెనుదిరిగారు.

పరిస్థితిని ముందే ఊహించి భారీ బందోబస్తు ఏర్పాటుచేసినప్పటికీ.. పోలీసులంతా గ్రామసభ జరిగే ప్రాంతంలో మోహరించారు. చర్చల కోసం వచ్చిన కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ వద్ద భద్రత లేకపోవడం గ్రామస్థులు దాడికి దిగడానికి అనుకూలంగా మారింది. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌ పరిధిలోని దుద్యాల మండలంలో 1,350 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించి ఫార్మా కంపెనీకి ఇవ్వాలని నిర్ణయించింది. ఇక్కడ ప్రభుత్వ భూమి 156 ఎకరాలే ఉంది. మిగతాది పట్టాభూముల నుంచి సేకరించాలి. దీన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణ ఉద్రిక్తతకు దారితీసింది. ఫార్మాసంస్థ ఏర్పాటుకు కారణం సదరు కాంగ్రెస్‌ నాయకుడే అంటూ ఆయన కారుపై రాళ్లు రువ్వి, అద్దాలు ధ్వంసం చేశారు. రక్షణగా వచ్చిన పోలీసులపైనా స్థానికులు తిరగబడ్డారు. పరిస్థితి అదుపుచేసేందుకు లాఠీఛార్జి చేసి ప్రజలను చెదరగొట్టాల్సి వచ్చింది. రైతులు మాత్రం బంగారం లాంటి తమ భూములను ఔషధ కంపెనీకి ఇచ్చేదే లేదంటూ తెగేసి చెబుతున్నారు. బలవంతంగా భూసేకరణ చేపడితే మాత్రం ఎంతవరకైనా వెళతామని హెచ్చరిస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :