గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ పోలీసుల ఎన్ కౌంటర్ లో చనిపోయిన విషయం తెలిసిందే.. వీరప్పన్ కు ఇద్దరు కుమార్తెలు కాగా రెండో కుమార్తె విద్యారాణి ప్రస్తుతం లోక్ సభ బరిలో నిలిచారు. తమిళనాడులోని కృష్ణగిరి నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. నాన్ తమిళర్ కట్టి (ఎన్ టీకే) పార్టీ తరఫున విద్యారాణి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 19న ఇక్కడ ఎన్నికలు జరగనుండడంతో ప్రచారంలో బిజీబిజీగా తిరుగుతున్నారు. ఈసారి గెలుపు తనదేనని విద్యారాణి ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణగిరి నియోజకవర్గంలో రైతులు సాగునీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారని, లోక్ సభకు ఎన్నికయ్యాక ఈ సమస్యకు పరిష్కారం కోసం పాటుపడతానని ఆమె వివరించారు. అదేవిధంగా నియోజకవర్గంలో నిరుద్యోగ యువత ఎక్కువగా ఉందని, ఉన్నత విద్యావంతులకూ తగిన ఉద్యోగం దొరకడంలేదని చెప్పారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు మహిళా సాధికారత కోసం శక్తివంచన లేకుండా పాటుపడతానని విద్యారాణి తెలిపారు.
తన తండ్రి వీరప్పన్ ను చిన్నతనంలో ఒకే ఒకసారి చూశానని విద్యారాణి తెలిపారు. పోలీసుల ఎన్ కౌంటర్ లో తండ్రి చనిపోవడం, తల్లి జైలుకు వెళ్లడంతో విద్యారాణి తన అమ్మమ్మ ఇంట్లో పెరిగారు. ఉన్నత విద్యాభ్యాసం చేసి న్యాయవాద పట్టా అందుకున్నారు. చదువుకునే రోజుల నుంచే ఓ స్కూలును నడుపుతున్నారు. దీంతో పాటు పలు సేవాకార్యక్రమాలు కూడా చేస్తున్నారు. తన తండ్రి నుంచే తనకు సేవాగుణం అబ్బిందని విద్యారాణి చెప్పారు. కాగా, కృష్ణగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టుంది. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. తాజాగా ఇండియా కూటమి పొత్తు నేపథ్యంలో అధికార డీఎంకే పార్టీ ఈ సీటును కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది.