ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను, అది కూడా గర్భంతో ఉన్న ఆమెను భర్త కిరాతకంగా చంపేశాడు. విశాఖలోని మధురవాడ ప్రాంతంలో ఈ ఘటనతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎనిమిది నెలల గర్భిణిని ఆమె భర్తే గొంతు నులిమి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ దారుణ సంఘటన మధురవాడ ఆర్టీసీ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సోమవారం వెలుగుచూసింది.
పీఎంపాలెం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆర్టీసీ కాలనీకి చెందిన జ్ఞానేశ్వర్, అనూష (27) మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం అనూష ఎనిమిది నెలల గర్భవతి. అయితే, సోమవారం ఉదయం దంపతుల మధ్య ఓ విషయంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన జ్ఞానేశ్వర్, భార్య అనూష గొంతును గట్టిగా నులిమేశాడు.
దీంతో అనూష ఊపిరాడక అక్కడికక్కడే స్పృహ కోల్పోయింది. వెంటనే జ్ఞానేశ్వర్, స్థానికుల సహాయంతో ఆమెను సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. అయితే, కేజీహెచ్‌కు చేరేసరికే అనూష మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
సమాచారం అందుకున్న పీఎంపాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, హత్యకు దారితీసిన పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.