కక్ష సాధింపు చర్యల కోసం నారా లోకేశ్ రెడ్ బుక్ తీసుకువస్తే, తాము మంచి పనులు చేసిన వారి పేర్లను రాసేందుకు గుడ్ బుక్ తీసుకువస్తామని వైసీపీ అధినేత జగన్ ప్రకటించడం తెలిసిందే. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు స్పందించారు. జగన్ రాసేది గుడ్ బుక్ కాదని, గుడ్డి బుక్ అని ఎద్దేవా చేశారు. గడచిన ఐదేళ్లలో జగన్ చేసిన మంచి పని ఇదీ అని చెప్పుకోవడానికి ఒక్కటైనా ఉందా? అని ప్రశ్నించారు.
రాష్ట్రాన్ని రూ.14 లక్షల కోట్ల అప్పుల్లో ముంచడం తప్ప జగన్ చేసింది గుండు సున్నా అని విమర్శించారు. ముఖ్యమంత్రిగా అనేక పర్యాయాలు ఢిల్లీ వెళ్లిన జగన్ ఎనాడైనా ఒక్క రూపాయి తెచ్చాడా? అని ఎత్తిపొడిచారు.
కూటమి ప్రభుత్వం ఎందుకు మంచిదో చంద్రబాబు చేతలతోనే చూపిస్తున్నాడని జీవీ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.2,348 కోట్ల ముందస్తు నిధులు చంద్రబాబు కృషి ఫలితమేనని అన్నారు. అమరావతి రింగ్ రోడ్ కు అనుమతులు, వ్యయాన్ని భరించేలా కేంద్రాన్ని ఒప్పించడం చంద్రబాబు ఘనతేనని తెలిపారు.
రోడ్ల గుంతలను పూడ్చేందుకే రూ.300 కోట్లను కేటాయించారని జీవీ వివరించారు. ఆరోగ్యశ్రీపై జగన్ ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా కూటమి ప్రభుత్వం చెల్లిస్తోందని వెల్లడించారు.
జగన్ హయాంలో పారిపోయిన పరిశ్రమలు కూటమి ప్రభుత్వం రాగానే తిరిగి వస్తున్నాయని తెలిపారు. సీఎం చంద్రబాబు చంద్రన్న బీమా పథకాన్ని మళ్లీ తీసుకువచ్చారని వివరించారు.