యుద్ధం వస్తే ఇరుదేశాల మధ్య విధ్వంసం జరుగుతుంది.. ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతుంది. ప్రస్తుతం ఉక్రెయిన్ – రష్యా, ఇజ్రాయెల్ – గాజా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలే దీనికి నిదర్శనం. అదే సమయంలో ఈ యుద్ధాలతో కొన్ని కంపెనీలు విపరీతంగా లాభాలను ఆర్జిస్తున్నాయని స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ (సిప్రి) నివేదిక వెల్లడించింది. యుద్ధాల కారణంగా ఆయుధాలకు భారీగా డిమాండ్ ఏర్పడిందని, ఆయుధ తయారీ కంపెనీలు భారీగా నియామకాలు చేపట్టి పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాల్సి వస్తోందని తెలిపింది. అయినప్పటికీ డిమాండ్ కు తగ్గట్లు ఆయుధాలను సరఫరా చేయలేకపోతున్నాయని వివరించింది.
2022 లో ఆయుధ కంపెనీల పరిస్థితి పెద్దగా ఆశాజనకంగా లేదని సిప్రి తెలిపింది. అయితే, 2023 లో మాత్రం ఆయుధ తయారీ కంపెనీలు ఏకంగా రూ.53 లక్షల కోట్ల వ్యాపారం చేశాయని పేర్కొంది. 2024లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోందని, డిమాండ్ ను అందుకోవడానికి ఆయుధ కంపెనీలు భారీగా నియామకాలు చేపట్టి ఉత్పత్తిని గణనీయంగా పెంచాయని వివరించింది.
అయినప్పటికీ డిమాండ్ ను అందుకోవడం టాప్ 100 ఆయుధ ఉత్పత్తి కంపెనీలకు సాధ్యం కావడంలేదని తెలిపింది. టాప్ 100 కంపెనీలలో 41 కంపెనీలు అమెరికాలోనే ఉన్నాయని, ఆయుధ విక్రయాలలో ఈ కంపెనీలు 2023 ఆర్థిక సంవత్సరం 2.3 శాతం వృద్ధిని సాధించాయని సిప్రి తన నివేదికలో వెల్లడించింది.
ఐరోపాలోని 27 భారీ ఆయుధ తయారీ సంస్థలు సగటున కేవలం 0.2 శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేశాయని తెలిపింది. రష్యా కంపెనీలు మొత్తం సగటున 40 % వృద్ధిని, ప్రభుత్వ రంగంలోని రోస్‌టెక్ 49 శాతం వృద్ధిని నమోదు చేశాయని సిప్రి పేర్కొంది. ఇజ్రాయెల్ లోకి 3 కంపెనీలు ఏకంగా 13.6 బిలియన్ డాలర్ల ఆయుధాలను, చైనా కంపెనీలు 103 బిలియన్ డాలర్ల ఆయుధాల అమ్మకాలు జరపగా.. తుర్కియేలోని డ్రోన్ తయారీ సంస్థ బేకర్ 24 శాతం వృద్ధి నమోదు చేసిందని సిప్రి తన నివేదికలో తెలిపింది.