తెనాలి టౌన్: గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని గాంధీనగర్‌లో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో ఆమెను హతమార్చి అనంతరం పూలదండ వేసి నివాళులర్పించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.పోలీసుల కథనం ప్రకారం.. కాకర్ల స్వాతి(31), కోటయ్య దంపతులు తెనాలి పట్టణంలోని నాజర్‌పేటలో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరు ఇంటర్ చదువుతుండగా, మరొకరు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. స్వాతి తెనాలి గాంధీనగర్‌లో బ్యూటీపార్లర్ నిర్వహిస్తోంది.
గత కొంతకాలంగా ఆమె ప్రవర్తనపై భర్త కోటయ్య అనుమానం పెంచుకున్నాడు. గత రెండు రోజులుగా ఇదే విషయంపై ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతోంది. ఈరోజు మధ్యాహ్నం కోటయ్య మద్యం సేవించి బ్యూటీ పార్లర్ వద్దకు వచ్చాడు. వస్తూనే మార్గం మధ్యలో కత్తి, పూలదండ తీసుకొచ్చాడు. బ్యూటీపార్లలో ఉన్న భార్యతో గొడవ పెట్టుకుని తన వెంట తెచ్చుకున్న కత్తితో మెడ, వీపు, చేతి భాగంలో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో ఆమె రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం ఆమెకు పూలదండ వేసి నివాళులర్పించారు. ఘటన తర్వాత నిందితుడు నేరుగా తెనాలి గ్రామీణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటనతో తెనాలి గాంధీనగర్‌లో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.