తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 9వ మహాసభలను నిజామాబాద్ నగరంలో గాయత్రి నగర్ లోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో సామాజిక కార్యకర్త సంధ్య ప్రారంభించారు. మహాసభ ప్రారంభానికి ముందు జెండా ఆవిష్కరణ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ భువనేశ్వర్ చేశారు. ఆహ్వాన సంఘం అధ్యక్షులు గొర్రపాటి మాధవరావు తొలిపలుకులు చేస్తూ దినమంత శ్రమ చేస్తూ, చేసిన శ్రమకు తగిన ప్రతిఫలం లేక యజమానుల దోపిడీ గురవుతున్న భీడి కార్మికులు సంఘటితంగా పోరాడి తమ జీవితాలను మెరుగు చేసుకోవాలని, మహాసభలు అందుకు దోహదపడాలని ఆయన ఆకాంక్షించారు.
బీడీ కార్మికులు మహిళలు, ఎక్కువమంది నిరక్షరాస్యులు కావడంతో బీడీ యజమానులు అనేక సంవత్సరాల నుంచి అనేక విధాలుగా దోపిడీ చేస్తున్నారని ఆమె అన్నారు. మహిళలు సమాజంలో వివక్షత గురవుతుంటే, మరోదిక్కు శ్రమదోపిడితో, ద్వితీయ శ్రేణి పౌరులుగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ ల వల్ల కార్మికుల హక్కులు కాలరాయపడుతున్నాయని ఆమె అన్నారు. మతం ముసుగులో మానవ హక్కులను మోడీ ప్రభుత్వం హరిస్తుందని ఆమె అన్నారు. ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు టి శ్రీనివాస్ మాట్లాడుతూ మోడీ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలు బహిరంగంగా వేలం వేస్తున్నారని, దేశాన్ని అప్పుల కొంపగా మార్చి వేస్తున్నారని ఆయన అన్నారు. 44 కార్మిక చట్టాలను రద్దుచేసి, కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేయడానికి నాలుగు లేబర్ కోడ్లను తెచ్చారని, పని గంటలు పెంచారని, యూనియన్ల రిజిస్ట్రేషన్ మునుగడ కష్టంగా మారిందని ఆయన అన్నారు. జాతీయత పేరుతో భారత ప్రజలను బజారుకిడుస్తున్నారని, ప్రజాస్వామిక విలువలను పాతరేస్తున్నారని ఆయన అన్నారు. కేంద్ర, ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమ్మెలు చేసిన పట్టించుకోకపోవడం దుర్మార్గమని, ఉపాధి భద్రతను కొల్లగొట్టి ఆకలి తీవ్రత పెంచితే కార్మికుల కోపాగ్నికి బలి కాక తప్పదని శ్రీనివాస్ కేంద్ర , ప్రభుత్వాలని హెచ్చరించారు. మోడీ విధానాలను వ్యతిరేకిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో కార్మిక హక్కులను నిర్లక్ష్యం చేస్తుందని ఆయన అన్నారు. బీడీ కార్మికులకు కనీస వేతనం జీవోను తీసుకురావాలని కేసిఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మహాసభలో ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి సూర్య శివాజీ, గౌరవ అధ్యక్షులు బి.భూమన్న, అరుణ, హరిత, ఖాజా మొయినుద్దీన్, శివకుమార్, ఆకుల రాములు, ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు, సామల గంగాధర్, నాయకులు నీలం సాయిబాబా, జేపీ గంగాధర్, పద్మ, తదితరులు పాల్గొన్నారు.