కెనడాలో ఓ భారత సంతతి బిల్డర్ బూటా సింగ్ గిల్ (59) హత్యకు గురయ్యారు. సోమవారం తన సంస్థ సైట్‌లో పనులను పరిశీలిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఆయన దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో వ్యక్తి మరణించగా ఇంకొకరు తీవ్రంగా గాయపడ్డారు. బూటా సింగ్ ఉంటున్న ఎడ్మంటన్‌లోని కావనా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
బూటా సింగ్.. గిల్ బుల్ట్ హోమ్స్ అనే లగ్జరీ నివాస సముదాయాల నిర్మాణ సంస్థను నిర్వహిస్తున్నారు. స్థానిక పంజాబీ ప్రజలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అక్కడి గురుద్వారా కార్యకలాపాల్లోనూ ఆయన చురుగ్గా పాల్గొంటారు.
కాగా, ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలకు ఎటువంటి ముప్పు లేదని పేర్కొన్నారు. అయితే, కాల్పులకు కారణం ఏమిటనేది ప్రస్తుతానికి మిస్టరీగా మారింది. ఇది స్థానిక పంజాబీలను కలవరానికి గురి చేస్తోంది. గిల్ మృతిపై నగర మాజీ కౌన్సెలర్ మోహిందర్ బగ్గా సంతాపం తెలియజేశారు. మృతుడికి స్థానిక పంజాబీలతో దగ్గరి సంబంధాలు ఉన్నాయని, మతపరమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని గుర్తు చేశారు. అవసరంలో ఉన్న వారికి సాయం చేయడంలో ముందుండే వారని అన్నారు. తనకు నష్టం వచ్చిన సందర్భాల్లోనూ ఇతరులకు సాయపడేందుకు వెనకాడేవారు కాదని పేర్కొన్నారు.