గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ బీటెక్ పూర్వ విద్యార్థిని (2016-20) శివాలీ జోహ్రి శ్రీవాస్తవ, ఆమె తల్లి కవిత జోహ్రి శ్రీవాస్తవ, తండ్రి అనిల్ శ్రీవాస్తవలు 15వ గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించి చరిత్ర సృష్టించారు. 3,200 ఒరిగామి పంది బొమ్మలను ఒకేచోట ఉంచిన ఈ కుటుంబం, అతి పెద్ద ప్రదర్శనగా రికార్డు నెలకొల్పినట్టు శనివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.
ఇంతకు మునుపు, శివాలి కుటుంబం చేతితో తయారు చేసిన కాగితపు బొమ్మలు, క్విల్ట్ పువ్వులు, ఒరిగామి వేల్స్, పెంగ్విన్లు, సిట్రస్ పండ్లు, మాపుల్ ఆకులు, మరికొన్నింటితో సహా వివిధ ప్రదర్శనలతో 14 గిన్నిస్ ప్రపంచ రికార్డులను పొందింది. ఇవే కాక, 15 అసిస్ట్ వరల్డ్ రికార్డ్స్, 10 యూనిక్ వరల్డ్ రికార్డులను శివాలి కుటుంబం కలిగి ఉందని వివరించారు.
మొత్తం 15 గిన్నిస్ రికార్డులను సాధించిన శివాలి, ఆమె తల్లిదండ్రులను గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ నర్మ, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డెరైక్టర్ ప్రొఫెసర్ వీ.ఆర్.శాస్త్రి, అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య, గణిత విభాగం అధ్యాపకుడు డాక్టర్ మల్లికార్జున్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.