రంగారెడ్డి: తెలంగాణలో మరో పరువు హత్య చోటుచేసుకుంది. ఓ మహిళా కానిస్టేబుల్ ను సొంత తమ్ముడే నరికి చంపినట్లు తెలుస్తోంది. ఈ దారుణ సంఘటన జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలంలో విషాదం చోటుచేసుకుంది. హయత్‌నగర్ పీఎస్‌లో నాగమణి అనే మహిళా కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం మండలంలోని రాయపోలు-ఎండ్లగూడ రోడ్డులో సోమవారం ఉదయం నాగమణి స్కూటీపై డ్యూటీకి వెళ్తుండగా.. సొంత తమ్ముడు ప్రసాద్ కారుతో ఢీకొట్టి, తర్వాత కత్తితో ఆమె మెడపై నరికి చంపాడు. సమాచారం అందుకున్న సీఐ సత్యనారాయణ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కాగా, నాగమణి నెల రోజుల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో నాగమణి కుటుంబ సభ్యులు.. ఆమెపై చాలా ఆగ్రహంతో ఉన్నారు. సమయం కోసం వేచి చూచిన తమ్ముడు.. ఇవాళ ఉదయం డ్యూటీకి వెళ్తుండగా అటాక్ చేసి హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు సమాచారం.
వివరాలు :
రాయపోలు నుంచి ఎండ్లగూడ వెళ్లే రహదారిపై ఈ ఘటన జరిగింది. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో నాగమణి విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆమెకు వివాహం జరగ్గా, 10 నెలల క్రితం భర్తతో విడాకులయ్యాయి. అనంతరం నెల రోజుల క్రితం మరో వ్యక్తిని కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇది నచ్చని ఆమె సోదరుడు పకడ్బందీగా ప్లాన్ చేసి, డ్యూటీకి వెళ్తుండగా కార్‌తో ఢీ కొట్టి, వేట కొడవలితో నరికి హత్య చేశాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
తమ్ముడు చంపేస్తున్నాడంటూ ఫోన్ చేసింది : ‘8 సంవత్సరాలుగా నేను నాగమణి ప్రేమించుకుంటున్నాం. మా ప్రేమ విషయం తెలిసి ఇంట్లో వాళ్లు నాగమణిని పట్టించుకోవడం మానేశారు. 2021లో ఆమెకు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. అంతకుముందు 4 సంవత్సరాలు తను హాస్టల్లోనే ఉంది. ఆ సమయంలో నేనే ఆమెకు కావాల్సిన అవసరాలు తీర్చి చదివించాను. కానిస్టేబుల్ జాబ్ వచ్చాక తల్లిదండ్రులు ఆమెకు దగ్గరయ్యారు. నవంబర్ 10వ తేదీన యాదగిరిగుట్టలో మేం పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్న వెంటనే మాకు ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం.
మేం పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మమ్మల్ని చంపుతామని నాగమణి కుటుంబసభ్యులు బెదిరిస్తూ వచ్చారు. ఈరోజు అనుకున్నట్టే నా భార్యను వాళ్ల తమ్ముడు చంపేశాడు. రాయపోల్ నుంచి హయత్‌నగర్ బయలుదేరే ముందు నాకు ఫోన్ చేసింది. మా తమ్ముడు నన్ను చంపేస్తున్నాడు అంటూ ఫోన్ కట్ చేసింది. వెంటనే మా అన్నయ్యకు విషయం చెప్పాను. ఆయన వెళ్లేలోపే రక్తపు మడుగులో నాగమణి కొట్టుకుంటుంది.’ అని నాగమణి భర్త శ్రీకాంత్ వివరించారు.