భారత సంతతికి చెందిన హిందువులు కెనడా విడిచి వెళ్లిపోవాలంటూ సిఖ్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్ జే) ఇటీవల చేసిన హెచ్చరికను కెనడా మంత్రులు ఖండించారు. ‘‘ఇండో-హిందువులూ కెనడాను వీడండి. భారత్ కు వెళ్లిపోండి. భారత్ కు మీరు మద్దతుగా నిలవడమే కాదు, ఖలిస్థాన్ అనుకూల సిక్కుల భావ వ్యక్తీకరణ అణచివేతకు సైతం మద్దతు తెలుపుతున్నారు’’ అంటూ ఎస్ఎఫ్ జే లీగల్ కౌన్సిల్ గుర్ పట్వంత్ పన్నమ్ ఓ వీడియో మెస్సేజ్ ను విడుదల చేశారు. దీంతో హిందూ కమ్యూనిటీకి చెందిన కెనడా వాసులు ఎస్ ఎఫ్ జే హెచ్చరికపై మంత్రి లేబ్లాంక్ కు లేఖ రాశారు. ఖలిస్థాన్ అనుకూల వర్గాల నుంచి బెదిరింపులు వస్తున్నందున దేశంలో నివసించే హిందూ వాసులకు భద్రత కల్పించాలని కోరారు.
