contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అతి తెలివితేటలతో బంగారం దొంగలించిన పూజారి

  • బాబోయ్.. ఈ స్వామీజీ మామూలోడు కాదు! రాగి చెంబు చూపించీ.. ఇంటిళ్లి పాదినీ ఏమార్చీ..బంగారం స్వాహా…
  • యాదాద్రి టూ…ఎన్టీఆర్ జిల్లా నందిగామ కి లింక్..ఎట్టకేలకు పోలీసులు ఛేదించి కటకటా లోకి పంపిన వైనం…అసలు స్టోరీ ఏంటి అంటే?
  • మోసపోయే వారు ఉంటే మోసం చేస్తూనే ఉంటారనే నానుడి నిజమవుతోంది.
  • స్వామీజీల ముసుగులో కేటుగాళ్లు అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. కొత్తగా నిర్మించిన ఓ ఇంటికి వచ్చిన స్వామీజీ.. ఆ ఇంట్లో బంగారు ఆభరణాలన్నింటినీ మాయం చేశాడు.
  • అమాయకులను ఆ స్వామీజీ ఎలా మోసం చేశాడు..?
  • 30 తులాల బంగారు ఆభరణాలు ఎలా తస్కరించాడు..?
  • సినీ ఫక్కిలో జరిగిన ఈ మోసాన్ని పోలీసులు బయటపెట్టి స్వామీజీని కటకటాల పాలు చేశారు.
  • స్వామీజీ చేసిన మాయ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

 

యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలం దేవలమ్మ నాగారం గ్రామ సర్పంచ్ గా ఉన్న కల్లెం శ్రీనివాస్‌రెడ్డి కొత్త ఇంటిని నిర్మించారు. సాధారణంగా ఇంటికి జరిపించే గృహ ప్రవేశ, వాస్తు పూజలు చేసేందుకు హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ చింతల్‌కుంటకు చెందిన పరుశరామ్‌ చైతన్య స్వామిని సంప్రదించాడు. ఇంటికి దోషం, నరదిష్టి ఉన్నాయని, ఏ పని చేసినా కలిసి రాదని స్వామీ చెప్పడంతో శ్రీనివాస్ రెడ్డి ఆందోళన చెందాడు. వాస్తు దోషం, నరదిష్టికి నివారణోపాయంగా శ్రీ చక్ర వాస్తు పూజ చేయాలని స్వామి చెప్పారు. స్వామి సూచన మేరకు గత నెల 26వ తేదీన కొత్త ఇంటిలో పూజలను ప్రారంభించారు. రెండు గంటలపాటు పూజలు చేసిన స్వామి…పూజలో ఇంట్లోని బంగారాన్ని రాగి చెంబులో వేయాలని చెప్పాడు.

స్వామి సూచనతో కుటుంబ సభ్యులు రాగి చెంబులో బంగారు ఆభరణాలు వేశారు. పూజ మధ్యలో విశ్రాంతి పేరుతో పదినిమిషాలు బయటికి వెళ్లి రమ్మని స్వామీజీ చెప్పాడు. కుటుంబ సభ్యులంతా ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో రాగి చెంబులోని బంగారు ఆభరణాలను స్వామీజీ తన సంచిలో వేసుకున్నాడు. మరో గంట తర్వాత పూజలను పూర్తి చేసి.. రాగి చెంబును పూజ గదిలో పెట్టించి 20 రోజుల పాటు పూజలు చేయాలని, రాగి చెంబులోని ఆభరణాలను 20 రోజుల తర్వాతే ముట్టుకోవాలని లేకపోతే హాని కలుగుతుందని చెప్పి స్వామీజీ హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు. పూజలు చేసిన మరుసటి రోజు 27న సర్పంచి శ్రీనివాస్ రెడ్డికి అనుమానం వచ్చి రాగి చెంబును పరిశీలించాడు. రాగి చెంబులో బంగారు నగలకు బదులు రాగి వస్తువులు కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వాస్తు పూజల పేరుతో తస్కరించిన ఆభరణాలను ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం సోమవరం గ్రామానికి చెందిన తన ఫ్రెండ్ పోలుబోయిన వెంకట నాగేశ్వర్‌రావుకు స్వామీజీ ఇచ్చాడు. నాగేశ్వర్‌రావు బంగారు ఆభరణాలను ఓ ప్రైవేట్‌ సంస్థలో తాకట్టు పెట్టాడు. విచారణ చేపట్టిన పోలీసులు స్వామీజీతోపాటు మరొకరిని అరెస్టు చేసి కటకటాల పాలు చేశారు. నిందితుల నుంచి కారు, బంగారు నగలను తనఖా పెట్టిన రశీదులను స్వాధీనం చేసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌ దేవేందర్‌ తెలిపారు. పూజల పేరుతో స్వామిజీలు చేసే మాయలో పడవద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :