నెల్లూరు జిల్లా : ఆత్మకూరు పట్టణంలోని మేకపాటి గౌతమ్ రెడ్డి మెమోరియల్ మున్సిపల్ బస్టాండ్ వద్ద కూటమి ప్రభుత్వం ప్రజలపై కరెంటు చార్జీల బాదుడుపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోరు బాట కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం నిరసన ర్యాలీ చేపట్టారు. ర్యాలీ పట్టణంలోని మెయిన్ బజార్ మీదుగా బీయస్ఆర్ సెంటర్, సోమశిల రోడ్డు సెంటర్ల మీదుగా విద్యుత్ శాఖ కార్యాలయం వరకు సాగింది. విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట నాయకులు, కార్యకర్తలతో విద్యుత్ ఛార్జీల బాధుడుపై నిరసన తెలిపిన అనంతరం విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.అనంతరం మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ తాను అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచబోనని హామిలిచ్చిన చంద్రబాబునాయుడు అవసరమైతే ఛార్జీలు తగ్గిస్తానంటూ బూటకపు హామిలు గుప్పించారని, అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామిలను తుంగలో తొక్కి ఆరు నెలలు తిరక్కుండానే జనంపై ఛార్జీల పిడుగు మోపారన్నారు. ప్రజల తరపున విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.నవంబర్ నెలలో రూ.6,072.86 కోట్లు, డిసెంబర్ లో రూ.9412.50 కోట్లు కలిపి మొత్తం రూ.15,485.36 కోట్లు ప్రజలపై భారం మోపారని పేర్కొన్నారు. ఇదే కొనసాగితే రూ.లక్ష కోట్ల భారం ప్రజలపై పడనుందన్నారు.తప్పుడు హామిలతో గద్దెనెక్కి ప్రజలకు చుక్కలు చూపుతున్నారని పేర్కొన్నారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామిలను గాలికి వదిలేశారని, చదువుకునే విద్యార్థుల దగ్గర నుండి అన్నదాతల వరకు ఏ ఒక్కరికి ఇచ్చిన హామిని నిలబెట్టుకోలేకపోయారన్నారు. ఆ హామిల అమలుకు సంవత్సరానికి రూ.1.30 లక్షల కోట్లు అవుతుందని, ఆ సమయంలో సంపద సృష్టి వచ్చు అని చెప్పిన చంద్రబాబు ప్రజలపై భారం మోపడమే ఆ సంపద సృష్టా అన్నారు.ప్రజలకు చెప్పిన పథకాలు ఇవ్వకపోగా, ప్రజల నుంచే వసూళ్లకు దిగారన్నారు.రాజధాని నిర్మాణం కోసం రూ.50వేలు కోట్లు పెట్టుబడులు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు సన్నధమవుతున్నారని, ప్రజలపై ఒక్క రూపాయి భారం పడకుండా చూస్తామని ఎన్నికల్లో చెప్పారని, ఇప్పుడు ప్రజలపై భారం మోపి ఆ మొత్తాన్ని అమరావతిలో పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గానికి రూ.250 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందని, దీంతో గ్రామ సచివాలయాలు, రోడ్లు, డ్రైనేజీలు లాంటి మౌళిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో మట్టి, ఇసుక మాయమైందని, ఇక్కడి ప్రజాప్రతినిధి ఇంటికి ఆ డబ్బంతా వెళ్తుందని అన్నారు.కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామిలతో ప్రజలంతా తమ ఇంటికి నగదు వస్తుందని భావించారని, అయితే ప్రజల వద్ద నుంచే తీసుకునే విధంగా ఆరు నెలల్లోనే ప్రభుత్వ పనితీరు జరిగిందన్నారు. ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ ప్రతి నిత్యం అండగా నిలబడేందుకు తమ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎప్పుడూ ముందుంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆత్మకూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మాజీ సొసైటి చైర్మన్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచ్ లు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
