పుల్లలచెరువు మండలం సిద్దెనపాలెం గ్రామాన్ని తాకట్టు పెట్టిన వైసీపీ నాయకుడిపై మార్కాపురం సబ్ కలెక్టరు బి.సహధిత్ వెంకట త్రివినాగ్ విచారణ చేపట్టారు.
మంగళవారం ఐటివరం పంచాయతీలోని సిద్దెనపాలెంలో అధికారులతో కలిసి ఆయన రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా సిద్దెనపాలెం గ్రామస్థులు మాట్లాడుతూ సిద్దెనపాలెం గ్రామంలో ఎ.4.32సెంట్ల భూమిని గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు గడ్డ సుబ్బయ్య అనే వ్యక్తి ముటుకుల సొసైటీలో తాకట్టు పెట్టారన్నారు. ఇదేమని ప్రశ్నించిన గ్రామస్థులపై దాడులు చేశారని ఆరోపించారు. గ్రామస్థులు ఏర్పాటు చేసిన బోర్లను పూడ్చి వేశారని అన్నారు.
ప్రశ్నించిన వారిని రూ.10 లక్షలు ఇస్తేనే ఊర్లో ఉండండి లేదంటే వెళ్లి పోండి అని 12 కుటుంబాలను ఊరి నుంచి తరిమి వేశారని ఆయన దృష్టి తీసుకెళ్లారు. గ్రామంలోని ప్రభుత్వ భూమిలో దర్జాగా చేపల చెరువు వేసి సాగు చేస్తున్నప్పటికీ, అధికారులు వత్తాసు పలికారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు విచారిస్తున్నట్లు తెలిపారు. ఐటీవరం రెవెన్యూ గ్రామంలోని సర్వే.నెం.296 సిద్దెపాలెం గ్రామానికి య.4.32 సెంట్ల భూమిని ఆన్‌లైను చేసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ఆన్‌లైన్ చేసుకున్న భూమిని ముటుకుల సోసైటీలో ద.నెం.2510/2020 తనఖా దస్తావేజుగా రిజిస్ట్రరు చేసి రూ.3 లక్షలు లోన్ తీసుకున్నట్లు ఫిర్యాదు అందిందన్నారు. రికార్డులు పరిశీలించి ప్రజలకు తాగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట తహసీల్దార్ మహ్మద్ నయీం, అధికారులు పాల్గొన్నారు.