రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తరువాత పార్టీ బలోపేతానికి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే పార్టీ లో కీలక మార్పులు, చేర్పులు చేసిన ఆయన తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు పార్లమెంట్ పరిశీలన బాధ్యతలు అప్పగించారు. జగన్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విప్ గా, రాష్ట్ర పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షుడుగా పనిచేసిన ఆయనకు ప్రతిపక్షంలో పార్టీని ఎలా బలోపేతం చేయాలన్న విషయాలలో అపారమైన అనుభవం ఉంది. అంతేకాక పార్టీ అధినేత జగన్ ఏ పని అప్పగించినా విజయవంతం గా పూర్తి చేయడం చెవిరెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. కనుకనే అత్యంత కీలకమైన పదవుల్లో ఒకటైన రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శితో పాటు ఒంగోలు బాధ్యతలు కూడా చెవిరెడ్డికి అప్పగించినట్లు సమాచారం.
తొలిసారి ఎంపీగా గట్టి పోటీ..
ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంకు తొలిసారి పోటీ చేసిన చెవిరెడ్డి టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై అతి తక్కువ మెజారిటీతో ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలో నిలిచిన ఎంపీ అభ్యర్థులు అందరికంటే అత్యధిక శాతం ఓట్లు సాధించిన చెవిరెడ్డికి ఒంగోలు పార్లమెంట్ పరిధిలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలు అప్పగించారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ తనపై పెట్టిన నమ్మ కాన్ని వమ్ము చేయక రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి అహర్నిశలు కష్టపడి పని చేస్తానని చెవిరెడ్డి స్పష్టం చేశారు.