ఎపి రాజకీయాల్లో 2022లో తీవ్ర కలకలం రేపిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ (అనంతబాబు) మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి పునః విచారణ జరపాలని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలు జారీ చేశారు.
కేసు దర్యాప్తు బాధ్యతలను ఎస్డీపీఓ మనీశ్ దేవరాజ్ పాటిల్‌కు అప్పగిస్తూ ఎస్పీ ఉత్తర్వులిచ్చారు. పునః విచారణ ప్రక్రియను వేగవంతం చేసి, 60 రోజుల వ్యవధిలో సమగ్ర దర్యాప్తు నివేదికను డీజీపీ కార్యాలయానికి, కాకినాడ జిల్లా ఎస్పీకి సమర్పించాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. అవసరమైతే, దర్యాప్తులో వెల్లడయ్యే కొత్త అంశాల ఆధారంగా అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని కూడా ఎస్డీపీఓకు జిల్లా ఎస్పీ సూచించారు. అంతేకాకుండా, ఈ కేసులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు, పోలీసులకు న్యాయ సలహాలు అందించేందుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సీనియర్ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
కేసు వివరాల్లోకి వెళితే… 2022 మే నెలలో ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద డ్రైవర్‌గా పని చేసిన సుబ్రహ్మణ్యం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని ఎమ్మెల్సీ అనంతబాబే స్వయంగా కారులో తీసుకువచ్చి అతని కుటుంబ సభ్యులకు అప్పగించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తొలుత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగినప్పటికీ, మృతదేహంపై గాయాలు ఉండటంతో ఇది హత్యేనని కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు ఆరోపించాయి. తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రూ. 25 వేల విషయంలో నెలకొన్న వివాదంతో పాటు, అనంతబాబు వ్యక్తిగత, వ్యాపార రహస్యాలు సుబ్రహ్మణ్యానికి తెలిసి ఉండటమే హత్యకు కారణమై ఉండవచ్చని అప్పటి పోలీసుల దర్యాప్తులో ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. విచారణలో సుబ్రహ్మణ్యంపై దాడి చేసినట్లు అనంతబాబు అంగీకరించారని పోలీసులు తెలిపారు. అనంతరం అనంతబాబును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది. కొంతకాలం జైలులో ఉన్న అనంతబాబు, ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. అనంతబాబు జైలు నుంచి బయటకు వచ్చిన సమయంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తాజాగా ఈ కేసు పునః విచారణ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.