contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

భర్తను చంపిన కేరళ నర్సు … మరణ శిక్ష విధించిన యెమెన్ కోర్టు

ఉపాధి కోసం యెమెన్ వెళ్లి అక్కడ ఓ హత్యకు పాల్పడిన కేరళ నర్సు నిమిష ప్రియకు మరణశిక్ష తప్పదనిపిస్తోంది. నిమిష ప్రియ తన కుటుంబంతో కలిసి యెమెన్ దేశం వెళ్లి అక్కడ నర్సుగా స్థిరపడింది. 2014లో ఆమె భర్త, కుమార్తె భారత్ కు తిరిగి వచ్చేశారు. ఆమె మాత్రం యెమెన్ లోనే ఉండిపోయింది. 2015లో ఆమె యెమెన్ లోనే సొంతంగా ఓ క్లినిక్ ప్రారంభించింది. ఆమెకు స్థానికుడైన తలాల్ అబ్డో మహ్దీ సాయపడ్డాడు. విదేశీయులు యెమెన్ లో ఏదైనా సంస్థ ఏర్పాటు చేయాలంటే స్థానికుల భాగస్వామ్యం తప్పనిసరి.

అయితే, కొంతకాలానికి నిమిష ప్రియ, మహ్దీ మధ్య గొడవలు మొదలయ్యాయి. యెమెన్ జాతీయుడైన మహ్దీ… నిమిష ప్రియను చిత్రహింసలు పెట్టేవాడు. ఆమె పాస్ పోర్టును లాగేసుకున్నాడు. అతడి నుంచి శారీరక, మానసిక వేధింపులు తీవ్రం కావడంతో అతడి నుంచి తన పాస్ పోర్టును వెనక్కి తీసుకునేందుకు నిమిష ప్రియ ప్రయత్నించింది. మహ్దీకి మత్తు మందును ఇంజెక్షన్ రూపంలో ఇచ్చింది. ఆ మందు మోతాదు మించడంతో మహ్దీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

ఈ ఘటనతో భయపడిపోయిన నర్సు నిమిష ప్రియ… మరో వ్యక్తితో కలిసి మహ్దీ మృతదేహాన్ని అక్కడ్నించి రహస్యంగా తరలించింది. అయితే కొన్నిరోజులకే ఆమె నేరం బయటపడింది. ఆమెను, ఆమెకు సహకరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

విచారణ జరిపిన ట్రయల్ కోర్టు కేరళ నర్సుకు మరణశిక్ష విధించింది. ఈ తీర్పును నిమిష ప్రియ యెమెన్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అయితే, ఆమె పిటిషన్ ను అక్కడి అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. త్వరలోనే ఆమెకు మరణశిక్ష అమలయ్యే అవకాశాలున్నాయి.

కాగా నిమిష ప్రియకు మరణశిక్ష పడడంతో భారత్ లో ఉన్న ఆమె తల్లి ఆందోళనకు గురైంది. యెమెన్ లో కల్లోల పరిస్థితుల కారణంగా భారత్ 2016 నుంచి ఆ దేశానికి రాకపోకలను నిలిపివేసింది. దాంతో నిమిష ప్రియ తల్లి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టగా… యెమెన్ లో నిమిష ప్రియ అప్పీల్ ను అక్కడి సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయాన్ని కేంద్రం తరఫు న్యాయవాది ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో నిమిష ప్రియ తల్లిని యెమెన్ పంపడంలో సాధ్యాసాధ్యాలపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి స్పష్టం చేసింది.

ఈ విషయంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్చి స్పందించారు. ఈ అంశాన్ని భారత కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని, అవసరమైతే దౌత్య పరమైన సాయం తీసుకుంటామని వెల్లడించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :