కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ వల్ల కాంగ్రెస్ కంటే బీజేపీకే ఎక్కువ ప్రయోజనమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ప్రతిపక్షంలో అలాంటి నేత ఒకరు ఉంటే అధికార పక్షం సాఫీగా నడుస్తుందంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ చేసిన భారత్ జోడో యాత్రపైనా యోగి విమర్శలు గుప్పించారు. అది భారత్ జోడో యాత్ర కాదని భారత్ థోడో యాత్ర అని విమర్శించారు. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి అక్కడ మన భారత దేశాన్ని తీవ్రంగా విమర్శిస్తారని, ఆయన వ్యాఖ్యల వెనకున్న మర్మాన్ని ప్రజలు గ్రహిస్తున్నారని వివరించారు. ఈ మేరకు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ గాంధీ మనస్తత్వాన్ని జనం గుర్తిస్తున్నారని తెలిపారు. ఆయనలాంటి నేతలు ప్రతిపక్షంలో ఉండటం బీజేపీకి ఎంతో లాభిస్తుందని సెటైర్ వేశారు. కాంగ్రెస్ పార్టీ అయోధ్య రామ మందిరం అంశాన్ని వివాదాస్పదం చేయాలని ప్రయత్నించిందని ఆరోపించారు. దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ.. ముస్లిం మహిళల సమస్యలకు పరిష్కారం ఎందుకు చూపలేకపోయిందని యోగి ప్రశ్నించారు. ట్రిపుల్ తలాక్ ను ఎందుకు రద్దు చేయలేకపోయిందని, కుంభమేళాను గర్వంగా ఎందుకు ప్రమోట్ చేయలేకపోయిందని నిలదీశారు. ప్రపంచ దేశాలకు దీటుగా భారత్ ను ఎందుకు నిర్మించలేకపోయిందని యోగి ప్రశ్నించారు.