ల్యాండ్ టైటిలింగ్ చట్టం గురించి వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న తెలుగు దేశం, జనసేన నాయకులు నందమూరి బాలకృష్ణ, పవన్ కల్యాణ్ లు ఆంధ్రప్రదేశ్ లో భారీగా భూములు కొన్నారని వారికి ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చారా లేక జిరాక్స్ కాపీలు ఇచ్చారా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో 9 లక్షలమంది రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని, వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒరిజినల్ పత్రాలనే ప్రభుత్వం అందజేసిందని తెలిపారు. అయినప్పటికీ చంద్రబాబు దుష్ర్పచారం ఏ స్థాయిలో ఉందో ప్రజలు గమనించాలని కోరారు. చివరి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన ప్రచార సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు.
ఇప్పుడు జరగబోయే యుద్ధం రెండు కులాల మధ్య యుద్ధం కాదని, రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధమని జగన్ చెప్పారు. పెత్తందారు ఒకవైపు పేదవాళ్లు ఒకవైపు ఉండి పోరాడే యుద్ధమిదని వివరించారు. పేదలకు, అవ్వాతాతలకు పెన్షన్లు, సంక్షేమ పథకాలు అందకుండా చంద్రబాబు టీమ్ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. వైద్యం కోసం పేదవాడు ఇబ్బంది పడకుండా, అప్పుల పాలు కాకుండా 25 లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీని విస్తరించామని తెలిపారు.
గ్రామంలోనే విలేజ్ క్లినిక్ లు ఏర్పాటు చేసినట్లు జగన్ వివరించారు. ఇంటివద్దకే రేషన్, ఇతర పౌర సేవలు అందించేలా పాలన చేశామని గతంలో ఇలా ఏ నాయకులైనా చేశారా అని ప్రశ్నించారు. ఎన్నడూ లేనివిధంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఈ ఐదేళ్లలో కల్పించగలిగామని వెల్లడించారు. మేనిఫెస్టోను ఒక బైబిల్ లా, ఖురాన్ లా, భగవద్గీతలా భావిస్తూ అందులో ఇచ్చిన హామీలను 99శాతం నెరవేర్చామని తెలిపారు. మేనిఫెస్టోను ఇచ్చి ఎన్నికలు అయ్యాక చెత్తబుట్టలో పడేసే చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు.