ప్రభుత్వ భూములు అమ్మి, 4 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చి రాష్ట్రాన్ని నడిపిస్తే… దాన్ని పాలన అంటారా? దిక్కుమాలిన పాలన అంటారా? అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. ఆమె మాట్లాడుతూ… అమరవీరుల ప్రాణ త్యాగాలతో వచ్చిన ప్రత్యేక రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేదన్నారు. ఎక్కడ చూసినా వైన్ షాపులు, బార్లు, పబ్బులు ఉన్నాయని, బళ్లు, గుళ్ల కంటే అవే ఎక్కువగా ఉన్నాయన్నారు. తెలంగాణలో పట్టపగలు కూడా మహిళలు రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదన్నారు.
తెలంగాణ ఏర్పడక ముందు కంటే ఇప్పుడు మద్యం అమ్మకాలు పదింతలు పెరిగాయన్నారు. మద్యం అమ్ముకొని కేసీఆర్ పరిపాలన చేస్తున్నారని ఆరోపించారు. 38 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మేశారన్నారు.
లక్షల కోట్ల అప్పు తెచ్చినా ఒక్క హామీ నిలబెట్టుకోలేదన్నారు. నాడు బ్రిటిష్ తెల్ల దొరలు దేశాన్ని పాలించి దోచుకుంటే, ఇప్పుడు మన తెలంగాణ నల్ల దొర కేసీఆర్ వాళ్లలాగే పాలన చేస్తున్నారన్నారు. కేసీఆర్ నియంత పాలన పోతేనే తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అన్నారు.