వైఎస్సార్సీపీ పార్టీలో వైఎస్సార్ లేరని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఈ పార్టీలో YSR అంటే వైవీ సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, రామకృష్ణారెడ్డి (సజ్జల) అని కొత్త నిర్వచనం చెప్పారు. వైసీపీ అంటే జగన్ పార్టీ అని అన్నారు. జగన్ కోసం తాను కుటుంబాన్ని, పిల్లలను వదులుకుని 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశానని… ఇప్పుడు వైసీపీ నేతలు తనపై ముప్పేట దాడి చేస్తున్నారని చెప్పారు. అన్నిటికీ సిద్ధమయ్యే తాను వచ్చానని చెప్పారు. వైసీపీని తన భుజాలపై మోశానని… ఆ పార్టీ కోసం తన రక్తం ధారపోశానని అన్నారు. ఒంగోలులో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ పాలనలో ఒంగోలుకు ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా? అని ప్రశ్నించారు. గత ఎన్నికల సమయంలో సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని జగన్ హామీ ఇచ్చారని… ఇప్పటి వరకు మద్య నిషేధం చేశారా? అని ప్రశ్నించారు. ఏ మొహం పెట్టుకుని మళ్లీ తనకే ఓటు వేయాలని మహిళలను అడుగుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ పాలనకు, జగన్ పాలనకు నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు.
70 వేల విలువైన గంగవరం పోర్టును రూ. 600 కోట్లకే అమ్మేశారని తాను చెపితే… దానికి సజ్జల ఇచ్చిన సమాధానం హాస్యాస్పదంగా ఉందని షర్మిల అన్నారు. ఆ రూ. 600 కోట్లతో ఇతర పోర్టులను అభివృద్ధి చేశామని సజ్జల అన్నారని… పోర్టులు అభివృద్ధి చేసేందుకు అవసరమైన రూ. 600 కోట్ల సంపదను కూడా సృష్టించలేకపోయారా? అని ఎద్దేవా చేశారు. మీరు చేసిన రూ. 9 లక్షల కోట్ల అప్పులు ఏమై పోయాయని ప్రశ్నించారు. ఆ అప్పుల్లో ఒక రూ. 600 కోట్లు పోర్టులకు ఖర్చు చేయలేకపోయారా? అని మండిపడ్డారు.