- ప్రతి నియోజకవర్గం నుంచి బాధిత విద్యార్థులు తరలి రావాలి
- జిల్లా పార్టీ విద్యార్థి విభాగం నేతలు బాధ్యత తీసుకోవాలి
- పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా పార్టీ అధ్యక్షులు భూమన
చంద్రగిరి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది.. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తును అందకారంలోకి నెట్టింది.. ఫీజు రీయంబర్స్ బకాయిలను ఆయా కాలేజీలకు చెల్లించకుండా చేతులు ఎత్తేయడంతో పేద విద్యార్థులు ఫీజులు కట్టలేక.. పరీక్షలు రాయలేక.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. ఇవన్నీ కూటమి పార్టీలకు కనిపించవు.. అందుకే ఈ గుడ్డి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేలా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 12న జరిగే ఫీజుపోరును విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నా..’’ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.
తిరుపతి పద్మావతీ పురంలోని భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి వద్ద పార్టీ ముఖ్యనేతలతో కలసి ఫీజు పోరుకు సంబంధించిన పోస్టర్లను ఆదివారం ఆవిష్కరించారు. తిరుపతి మేయర్ డాక్టర్ శిరీషా, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు భూమన అభినయ్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డిలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిలతో కలసి ఫీజు పోరు పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం భూమన మాట్లాడుతూ తిరుపతి, చిత్తరూ జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద 12వ తేదీన ఫీజుపోరుపై నిరసన వ్యక్తం చేసి కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించే కార్యక్రమానికి బాధిత విద్యార్థులను పెద్ద ఎత్తున తీసుకురావాలన్నారు. ఆ బాధ్యతలను పార్టీకి అనుబందమైన విద్యార్థి విభాగం నేతలు చేపట్టాలని, వారికి ఆయా నియోజకవర్గాల పార్టీ ఇన్ చార్జిలు సహకరించాలని సూచించారు. జిల్లా పార్టీ అధ్యక్షునిగా తమవంతు సహకారం అందిస్తానని, విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కూడా ఈ ఫీజుపోరులో భాగస్వామ్యం చేయవచ్చని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆ కార్యక్రమం జరుగుతుందని, చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు, తిరుపతి కలెక్టర్ కార్యాలయాల వద్ద జరిగే ఫీజుపోరుకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆ విషయాన్ని పార్టీలో ప్రతి ఒక్కరు గుర్తుంచుకుని ఫీజుపోరును విజయవంతం చేయడానికి శక్తి వంచన లేకుండా పనిచేయాలని విన్నవించారు. అనంతరం జిల్లా పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షులు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు విద్యార్థి విభాగం తరపున అధ్యక్షులను నియమించడం జరిగిందని, వారంతా ఉత్సాహంగా పనిచేయాలన్నారు. విద్యార్థులను తరలించే విషయంలో ఎక్కడా సమస్య రాకుండా ఆయా నియోజకవర్గాల పార్టీ ఇన్ చార్జిలు బాధ్యత తీసుకుని రవాణా సౌకర్యం కల్పించాలని విన్నవించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం నేతలు, తిరుపతి నగరపాలక సంస్థకు చెందిన పలువురు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.