ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికలను ఎదుర్కోవడానికి అన్నిరకాలుగా సమాయత్తమవుతోంది.
చిన్న విషయంలో కూడా అలసత్వానికి తావివ్వకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తేనే విజయం ఖాయమనే నమ్మకంతో ఉంది. అందుకే ఢిల్లీకి చెందిన ఒక ప్రయివేటు ఏజెన్సీతో సొంతంగా సర్వే నిర్వహింప చేయించు కుంటున్నట్లు తెలుస్తోంది.
రెండు నివేదికలను పోల్చి చూసుకోవడానికి.
వైఎస్సార్‌సీపీకి ఎన్నికల వ్యూహకర్తగా ఐప్యాక్ అధినేత ప్రశాంత్ కిషోర్ సహచరుడు రుషిరాజ్ సింగ్ పనిచేస్తున్నారు.
ఇప్పటికే ఆయన నెలవారీగా పలు నివేదికలను ముఖ్యమంత్రి జగన్‌కు అందజేస్తున్నారు. ఇదిలా ఉండగానే వైసీపీ ఢిల్లీకి చెందిన ఒక ప్రయివేటు ఏజెన్సీద్వారా మరో సర్వే నిర్వహింప చేస్తోంది.
నెలవారీగా వచ్చే నివేదికలు కాకుండా వీరైతే ఏ తరహా నివేదికలిస్తారనే కోణంలో ఆలోచించి ఈ సర్వే చేయించు కుంటున్నట్లు సమాచారం.
వీరి నివేదికను,నెలవారీ అందే నివేదికలను పోల్చిచూసుకుంటే మరింత మెరుగ్గా ఎన్నికలను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటోందని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఏ ప్రభుత్వానికైనా ఎమ్మెల్యేల పనితీరే ముఖ్యం.
ఏ ప్రభుత్వానికైనా రెండోసారి అధికారంలోకి రావాలంటే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల పనితీరు బాగుండటం ముఖ్యం.అందుకే ఈ అంశంపైనే జగన్ ఎక్కువగా దృష్టి సారించారు.
ఎవరిపై వ్యతిరేకత ఉంటే వారికి సీటు దక్కడం కష్టమని, చివరి నిముషంలో తనపై అసంతృప్తి వ్యక్తంచేసినా ఉపయోగం ఉండదని ఇప్పటికే ఆయన ఖరాఖండిగా చెప్పేశారు.
ఎమ్మెల్యేలతోపాటు మంత్రుల పనితీరు, పార్టీలోని సీనియర్ నేతల పనితీరు,ప్రజలను సంతృప్తి పరిచే విషయాలు,వారిలో అసంతృప్తి రేకెత్తడానికి కారణమైన అంశాలు.. ఇలా అన్నిరకాలుగా జగన్ నివేదికలను తెప్పించుకుంటున్నారు.
మూడు అంశాలు ప్రధానంగా.
ఢిల్లీ ఏజెన్సీ నిర్వహించే సర్వేలో వాలంటీర్ల పనితీరు ఎలా ఉంది? రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల పనితీరు? ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? ఈ మూడు అంశాలు ప్రధానంగా సర్వే జరుగుతోంది.
అంతిమంగా ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు? వారు ఏ అంశాలకు ప్రాధాన్యమిస్తున్నారు? సంతృప్తిగా ఉన్నారా? అసంతృప్తిగా ఉన్నారా? అనే అంశంపైనే ప్రధానంగా సర్వే జరుగుతోంది.
నివేదికలు అందిన తర్వాత వాటిని క్రోడీకరించి ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకుంటారని వైసీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి…!!