తణుకు, పెదకూరపాడు, గజపతినగరం, అమలాపురం నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇవాళ భారీ సంఖ్యలో టీడీపీలో చేరారు. వీరికి టీడీపీ అధినేత చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇవాళ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉన్నవారే టీడీపీలోకి వస్తున్నారని తెలిపారు.
ఓటమి ఖాయమని జగన్ కు అర్థమైందని వ్యాఖ్యానించారు. ఇన్ని అరాచకాలు చేసిన వ్యక్తి సీఎంగా పనికిరారని అన్నారు. తాను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని, 28 ఏళ్లుగా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నానని, అందరి ఆశీస్సులతో రాష్ట్రానికి, తెలుగుజాతికి మంచి పేరు, గౌరవం తీసుకువచ్చానే తప్ప, ఎప్పుడూ అపఖ్యాతి తీసుకురాలేదని అన్నారు.
ఒక్క చాన్స్ అని అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అరాచకాలమయం చేశారని మండిపడ్డారు. ఇలాంటివి చూస్తుంటే మనసు కలచివేస్తుందని, ఒక్కోసారి రాష్ట్రం పరిస్థితి తలచుకుంటే రాత్రి నిద్ర కూడా రాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క చాన్స్ ఇస్తే… నాలుగు సంవత్సరాల 9 నెలల పాటు బాధపడాల్సి వచ్చిందని చంద్రబాబు వివరించారు. చివరికి దేవుడే దిక్కు అనే పరిస్థితికి వచ్చారని వ్యాఖ్యానించారు. కానీ, మన రాతను తిరగరాసే శక్తి మన చేతుల్లోనే ఉందని చంద్రబాబు ఉద్ఘాటించారు.
ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ఒక రైతుకు, ఒక ఆటోడ్రైవర్ కు, ఒక నిరుద్యోగికి, ఒక మహిళకు ఏమైనా ప్రయోజనం కలిగిందా అని వైసీపీ వాళ్లను అడుగుతున్నా అంటూ నిలదీశారు. రాష్ట్ర ప్రజలు బాగుండాలనే తన నివాసంలో యజ్ఞయాగాలు చేశానని చంద్రబాబు వెల్లడించారు. తుపాన్లను మనం నివారించలేమని, కానీ తగిన చర్యలు తీసుకుంటే వాటి వల్ల కలిగే నష్టాలను తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. కానీ ఇటీవల తుపాను సందర్భంగా పలు ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ప్రజలను చూస్తే బాధ కలిగిందని చెప్పారు. ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నామన్న నిస్సహాయతతో బాధపడ్డానని తెలిపారు.
కాలువల్లో పూడిక తీయకపోవడం వల్ల పంటలన్నీ మునిగిపోయాయని పేర్కొన్నారు. హెలికాప్టర్ లో తిరిగేవారికి తుపాను నష్టాలు తెలుస్తాయా తమ్ముళ్లూ అని ప్రశ్నించారు. అదే, టీడీపీ అధికారంలో ఉండుంటే పరిస్థితి మరోలా ఉండేదని, ప్రజల ముఖాల్లో ఆనందం చూసేవరకు వారి వద్దనే ఉండేవాడ్ని అని స్పష్టం చేశారు.
వైసీపీ నేతలకు వాటాలు ఇవ్వలేక పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని చంద్రబాబు విమర్శించారు. ఒక్క విశాఖలోనే రూ.40 వేల కోట్ల విలువైన ఆస్తులను కబ్జా చేశారని ఆరోపించారు. వీళ్ల కన్ను పడితే అంతే సంగతులని అన్నారు.
“విశాఖలో గాదిరాజు ప్యాలెస్ ను వైసీపీ నేత అడిగారు… ఇవ్వకపోతే ఆ భూమి ప్రభుత్వ స్థలంలో ఉందంటూ బెదిరిస్తున్నారు. ఆ భూమి 22-ఏ కేటగిరీలో ఉందంటూ ఆ ప్యాలెస్ యజమానిని వేధిస్తున్నారు. గుంటూరులో శంకర్ విలాస్ హోటల్ పరిస్థితి కూడా ఇంతే. రంగనాయకమ్మ అనే మహిళ గతంలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై ట్వీట్ పెట్టారు. అదే ఆమె చేసిన పాపం అయింది. అప్పట్నించి ఆమెను వేధించడం మొదలుపెట్టారు.
శంకర్ విలాస్ ను కొనసాగకుండా అడ్డుకున్నారు. అంతేకాకుండా, దాడులు కూడా జరగడంతో ఆమె శంకర్ విలాస్ మూసివేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పక్కనే ఆమె చిన్న వ్యాపారం చేసుకోవాలని ప్రయత్నించినా, అడ్డుకున్నారు. దాంతో విధిలేని పరిస్థితుల్లో ఆమె గుంటూరు వదిలి హైదరాబాద్ వెళ్లిందంటే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ప్రజలందరూ వీళ్లకు బానిసలుగా ఉండాలి… లేకపోతే రాష్ట్రం వదిలి వెళ్లిపోవాలి! ఇది ప్రజాస్వామ్యమా అని అడుగుతున్నా. ఎవరైనా మాట్లాడితే వారిపై కేసులు పెట్టేస్తారా? నాకు అన్యాయం జరిగిందని ఎవరైనా అంటే వారిపై రౌడీలు వచ్చి పడిపోతారా? ఏ మాత్రం విశ్వసనీతయ లేని వ్యక్తి, ఏ మాత్రం విలువలు లేని వ్యక్తి ఈ జగన్ మోహన్ రెడ్డి” అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.
పెదకూరపాడు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకు ఈసారి టికెట్ ఇవ్వడంలేదని, అతడిని మార్చుతున్నారని చంద్రబాబు వెల్లడించారు. శంకరరావును తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేశారని, కానీ అతడిని దొంగ ఇసుక వ్యాపారం చేయమన్నారని వివరించారు. సీఎం చెప్పినట్టే శంకర్రావు చేశాడని, కానీ, శంకర్రావు వల్ల తనకు చెడ్డపేరు వచ్చిందని, అతడిని మార్చితే తనకు మంచి పేరు వస్తుందని ఇప్పుడు మరొకరికి టికెట్ ఇస్తున్నాడని చంద్రబాబు పేర్కొన్నారు. కానీ శంకర్రావును మార్చితే పరిస్థితులు మారవని, మార్చాల్సింది ఈ ముఖ్యమంత్రినే అని చంద్రబాబు స్పష్టం చేశారు.
త్వరలోనే తాను ప్రజల్లోకి వస్తానని, రాబోయే ఐదేళ్లలో తాము ఏం చేయబోతున్నామో అందరికీ వివరిస్తామని తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయమని, రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న శని జగన్ వదిలిపోవడం తథ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.