మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నెచ్చెలి శశికళ విడుదలపై మరో రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని ఆమె తరపు న్యాయవాది రాజా సెంధూర్ పాండియన్ తెలిపారు. అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న శశికళ సత్ప్రవర్తన కారణంగా వచ్చే ఏడాది జనవరిలో ముందస్తుగా విడుదలయ్యే అవకాశం ఉంది.ఈ కేసులో శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ. 10 జరిమానాను కోర్టు విధించింది. కాగా, దసరా ఉత్సవాల సందర్భంగా ఈ నెల 27వ తేదీ వరకు కోర్టుకు సెలవులు ఉన్నాయని, తెరుచుకున్న తర్వాత ‘చిన్నమ్మ’ విడుదలపై స్పష్టత వస్తుందని న్యాయవాది సెంధూర్ పాండియన్ పేర్కొన్నారు. జరిమానాగా చెల్లించాల్సిన సొమ్మును సిద్ధం చేశామని, కోర్టు నుంచి కబురు వచ్చిన వెంటనే ఆ మొత్తాన్ని చెల్లిస్తామని తెలిపారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో రెండు రోజుల్లోనే ఆమె విడుదలకు సంబంధించిన సమాచారం తెలుస్తుందని అన్నారు.