ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని షెడ్యూలు 9,10 కింద జాబితాలో పేర్కొన్న సంస్థలు, జాబితాలో లేని సంస్థల మొత్తం ఆస్తుల విలువ 1,42,601 కోట్ల రూపాయలు. చట్టబద్దంగా జరగాల్సిన ఈ ఆస్తుల విభజన ఇప్పటి వరకు జరగనందున దాని దుష్ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై పడింది. ఆస్తుల విభజన ప్రక్రియను వేగవంతం చేయడానికి తీసుకుంటున్న చర్యలు ఏమిటని బుధవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్‌సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్‌ను ప్రశ్నించారు.
దీనికి మంత్రి జవాబిస్తూ విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూలు కింద పేర్కొన్న సంస్థల విభజనకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. 90 ఆస్తులను రెండు రాష్ట్రాల మధ్య విభజించాలని కమిటీ సిఫార్సు చేసిందని చెప్పారు. ఈ ఆస్తులలో 68 సంస్థల విభజనకు తెలంగాణ ఎలాంటి అభ్యతరం తెలపలేదు. ఆంధ్రప్రదేశ్ 68గాను కేవలం 33 సంస్థల విభజనకు మాత్రమే అంగీకరించింది. పెండింగ్‌లో ఉన్న అన్ని ఆస్తుల విభజనకు సమగ్రమైన పరిష్కారం కావాలని ఆంధ్రప్రదేశ్ కోరుతుండగా కేసుల వారీగా మాత్రమే పరిష్కరించాలని తెలంగాణ కోరుతున్నట్లు మంత్రి తెలిపారు.