ఆక్లాండ్ లో జరిగిన రెండో టి20 మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో నెగ్గింది. మ్యాచ్ ముగిసిన అనంతరం కెప్టెన్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ, మొదట బంతితో రాణించడం వల్లే మ్యాచ్ లో విజయం నల్లేరుపై నడకలా సాగిందని అభిప్రాయపడ్డాడు.
బ్యాటింగ్ పిచ్ పై తమ బౌలర్లు అద్భుతంగా రాణించారని కితాబిచ్చాడు. జడేజా అమోఘంగా బౌల్ చేశాడని, చాహల్ ఆధారపడదగ్గ ఆటగాడని మరోసారి నిరూపించుకున్నాడని కొనియాడాడు.
బుమ్రా, షమీ, శార్దూల్, శివమ్ దూబే బంతితో తమవంతు పాత్ర నిర్వర్తించారని, న్యూజిలాండ్ జట్టును వారి సొంతగడ్డపై 132 పరుగులకు పరిమితం చేయడం మామూలు విషయం కాదని అన్నాడు. ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ మైదానం గుండ్రంగా ఉండదని, కోణాలు తిరిగి ఉండే ఇలాంటి మైదానంలో ఫీల్డర్లను మోహరించడం కష్టమని, ఈ విషయంలో తాము ఎంతో అవగాహన పెంచుకున్నామని వివరించాడు. విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా న్యూజిలాండ్ పర్యటనలో వరుసగా రెండో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference