ఉక్రెయిన్ పై దండయాత్రను ఉద్ధృతం చేసిన రష్యా బలగాలు తాజాగా ఓ అమెరికా పాత్రికేయుడి ప్రాణాలు బలిగొన్నాయి. ఉక్రెయిన్ శరణార్థులు సరిహద్దు దాటుతుండగా, ఓ పాత్రికేయ బృందం ఆ దృశ్యాలను చిత్రీకరిస్తోంది. వారు ఉన్న వాహనంపై రష్యా సేనలు విచ్చలవిడిగా కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో బ్రెంట్ రెనాడ్ (51) అనే ఫ్రీలాన్స్ ఫొటో జర్నలిస్టు ప్రాణాలు విడిచాడు. కాల్పులు జరిగిన సమయంలో రెనాడ్ తన సహచరులతో కలిసి ఓ ట్రక్కులో ఉన్నాడు. ఈ ఘటన ఇర్పిన్ నగరం వద్ద జరిగింది. రెనాడ్ తో పాటు ఉన్న ఇతరులు గాయపడ్డారు.
కాగా, రెనాడ్ మృతదేహంపై ఉన్న మీడియా బ్యాడ్జ్ ను పరిశీలించిన అధికారులు అతడు న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్టు అని భావించారు. అయితే, దీనిపై న్యూయార్క్ టైమ్స్ వివరణ ఇచ్చింది. బ్రెంట్ రెనాడ్ గతంలో తమ సంస్థలో పనిచేశాడని, ప్రస్తుతం అతడు ఫ్రీలాన్సర్ గా పనిచేస్తున్నాడని, ఓ అసైన్ మెంట్ కోసం ఉక్రెయిన్ వచ్చినట్టు తెలిసిందని స్పష్టం చేసింది. ఏదేమైనా బ్రెంట్ మృతికి విచారిస్తున్నామని, అతడు ప్రతిభావంతుడైన ఫొటో జర్నలిస్టు అని, తమకోసం అనేక వార్తల వీడియోలు రూపొందించాడని వెల్లడించింది.