contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఉద్యోగులను మోసం చేశారంటూ ప్రభుత్వంపై పవన్ విమర్శలు

ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం విజయవాడలో రోడ్లపైకి రావడం బాధ కలిగించిందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రభుత్వం జీతం పెంచినట్టు చెబుతోందని, కానీ 5 వేల నుంచి 8 వేల రూపాయల వరకు జీతాలు తగ్గిపోయాయంటూ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు, కార్యాలయాల్లో విధులు నిర్వర్తించాల్సిన ఉద్యోగులు ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదంటూ బయటికి వచ్చి నిరసనలు తెలియజేయాల్సి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. తనకున్న సమాచారం మేరకు 200 మందిని అరెస్ట్ చేశారని, లాఠీచార్జి కూడా చేసినట్టు తెలిసిందని అన్నారు.

తాను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకునే అని, టీఏలు, డీఏలు, పీఆర్సీ పెంపు వంటి అంశాలతో ప్రతి ఉద్యోగి తన కుటుంబం కోసం ప్రణాళిక వేసుకుంటాడని పవన్ కల్యాణ్ వివరించారు. వైసీపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పారని, ఇప్పుడు దాని ఊసే లేదని విమర్శించారు. తమ ప్రభుత్వం వస్తే జీతాలు పెరుగుతాయని చెప్పారని, కానీ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచకపోగా, ఇంకా తగ్గించడం అనేది ఉద్యోగులను మోసం చేయడమేనని అన్నారు.

8 శ్లాబుల్లో వచ్చే హెచ్ఆర్ఏని రెండు శ్లాబులకు కుదించడం వల్ల 5 వేల నుంచి 8 వేల వరకు జీతం తగ్గిపోతుందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయని వివరించారు. చర్చల సమయంలోనూ ఉద్యోగుల పట్ల అవమానకర రీతిలో ప్రవర్తించారని ఆరోపించారు. ఉద్యోగులను అర్ధరాత్రి వరకు వేచిచూసేలా చేయడం, వారి సమస్యలను సరైన రీతిలో పట్టించుకోకపోవడం వల్లే ఇవాళ ఇంత పెద్దఎత్తున ఉద్యోగులు రోడ్లపైకి వచ్చారని భావిస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలో వైసీపీ నేతల ఆదాయం 3 రెట్లు పెరిగితే, ఉద్యోగుల జీతాలు 30 శాతం తగ్గిపోయిందని పేర్కొన్నారు. ఉద్యోగులను నమ్మించి మోసం చేశారని పవన్ అభిప్రాయపడ్డారు.

ఉద్యోగుల సమస్యలపై తాను ముందే మాట్లాడదామని అనుకున్నానని, అయితే తమ డిమాండ్ల సాధనలో రాజకీయ పార్టీల సహకారం తీసుకోవడంలేదని ఉద్యోగులు చెప్పడంతో వెనుకంజ వేశానని పవన్ వివరించారు. అయితే ఉద్యోగులు కోరితే కచ్చితంగా మద్దతు ఇవ్వాలని పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :