ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీని సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలిలోనూ క్రమంగా తన బలాన్ని పెంచుకుంటోంది. తాజాగా జరిగిన మండలి ఎన్నికల్లో ఆ పార్టీకి ఎదురులేకుండా పోయింది. మొత్తం ఆరు స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను ఎలక్షన్ కమిషన్ ప్రకటించగా, కేవలం ఆరుగురి నుంచి మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయి. వారంతా వైసీపీకి చెందిన వారే. దీంతో వారందరి అభ్యర్థిత్వాలూ ఖరారైనట్టు రిటర్నింగ్ అధికారి తెలిపారు.కాగా, వైసీపీ తరఫున మహమ్మద్ ఇక్బాల్, కరీమున్నీసా, బల్లి కల్యాణ్ చక్రవర్తి, చల్లా భగీరథ రెడ్డి, దువ్వాడ శ్రీనివాస్, సీ రామచంద్రయ్యలను ఎంపిక చేసుకున్న సీఎం వైఎస్ జగన్, గురువారం నాడు వారికి బీ ఫారమ్ లను అందించిన సంగతి తెలిసిందే. ఈ ఆరుగురి ఎన్నికతో వైసీపీ బలం మండలిలో 18కి చేరుకుంది. ప్రస్తుతం శాసన మండలిలో టీడీపీ సభ్యుల సంఖ్య 26గా ఉండగా, ప్రోగ్రసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు ఐదుగురు, బీజేపీ మూడు, ఇండిపెండెంట్లు మూడు ఉన్నాయి. మరో మూడు ఖాళీలకు ఎన్నికలు జరగాల్సి వుంది.