ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలకు వర్తింపచేసింది. నేటి నుంచి రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల్లో ఆరోగ్యశ్రీ అమల్లోకి వస్తుందని సీఎం జగన్ తెలిపారు. ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ చికిత్సల విస్తరణను ఆయన ప్రారంభించారు. ఇకపై క్యాన్సర్ సహా 2,434 వైద్య ప్రక్రియలకు సంబంధించి ఉచితంగా చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి.ఇప్పటివరకు 7 జిల్లాల్లోనే అమలైన ఆరోగ్యశ్రీ సేవలు నేటి నుంచి మిగిలిన 6 జిల్లాల్లోనూ షురూ అయ్యాయి. ఇప్పటివరకు ఉన్న ఆరోగ్యశ్రీ చికిత్సల జాబితాకు అదనంగా మరో 234 వ్యాధులను కూడా ప్రభుత్వం చేర్చింది. ఆసుపత్రుల్లో రూ.1000 బిల్లు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తారు. బిల్లు రూ.1000 దాటితే మిగతా బిల్లును ప్రభుత్వమే చెల్లిస్తుంది.