ఏపీలో ఇటీవలే శాసనమండలిని రద్దు చేస్తున్నట్టు సీఎం జగన్ ప్రకటించడం తెలిసిందే. సీఎం జగన్ మండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కాగా, దీనిపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఏపీలో శాసనమండలి రద్దు బిల్లు, 3 రాజధానుల అంశంపై తమకు ఎలాంటి సమాచారం లేదని వెల్లడించారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎలాంటి సమాచారం రాలేదని స్పష్టం చేశారు. ఒకవేళ సమాచారం వస్తే రాజ్యాంగ పరంగానే వ్యవహరిస్తామని అన్నారు. కాగా, అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అమరావతి రైతులు కిషన్ రెడ్డిని కలిశారు. రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతులు కిషన్ రెడ్డికి తెలిపారు. ఈ అంశంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.