ది రిపోర్టర్ టీవీ న్యూస్ : ఏప్రిల్ 9న పార్టీ పేరును ప్రకటించాలని వైఎస్ షర్మిల నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఖమ్మం జిల్లాలో లక్ష మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీని ప్రకటించాలని ఆమె నిర్ణయించారు. ఇప్పటికే ఖమ్మం జిల్లా నేతలతో షర్మిల చర్చించారు. ‘వైఎస్సార్‌టీపీ’.. ‘వైఎస్సార్ పీటీ’.. రాజన్నరాజ్యం అనే పేర్లను ఆమె పరిశీలించారు. మే 14 నుంచి లోటస్ పాండ్ వేదికగా పార్టీ కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. మొదట జులై 8న పార్టీని ప్రారంభిస్తారని అనుకున్నా…ప్రస్తుతం ఎండల కారణంగా తేదీల మార్పువిషయంలో షర్మిల అనుచరులతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఏప్రిల్ 9న ఖమ్మంలో చివరి ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తుండగా… అదే రోజు పార్టీ పేరును సైతం ఖమ్మం సభ వేదికగానే ప్రకటించేందుకు రంగంసిద్ధం చేసుకుంటున్నారు. మే 14 రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తేదీని పార్టీ ఏర్పాటుకు వాడుకోవాలనుకున్నా….ఎండల కారణంగా…. సభ పెట్టలేమని… ఆ రోజే పార్టీ వ్యవహారాలను లోటస్‌పాండ్ నుంచే ప్రారంభిస్తే బాగుంటుందన్న ఆలోచనలో షర్మిల ఉన్నారు. మరోవైపు షర్మిలపై వివిధ పార్టీల నేతలు చేస్తున్న రాజకీయ విమర్శకులకు షర్మిల అనుచరులు కౌంటర్ వేయడం ప్రారంభించారు. ఇటీవల సమ్మేళనంలో ఒక విద్యార్థిని షర్మిల ఓదార్చడం రాజకీయంగా చర్చనీయంశమైంది. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ చేసిన వాఖ్యలను షర్మిల అనుచరులు ఖండించారు.ఇక మంగళవారం వైఎస్ షర్మిల మహబూబ్‌నగర్ జిల్లా అభిమానులతో సమ్మేళనం నిర్వహించబోతున్నారు. దాదాపు 700మంది ముఖ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించడంతో పాటు 5 వేలమంది వస్తారని షర్మిల అభిమానులు చెప్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వలసలను చూసి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చలించి పోయారని… దాదాపు జిల్లా వ్యాప్తంగా 14 ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టడంతో పాటు 4 లక్షల ఎకరాలకు సాగు నీరందించారని… అయినా ఇంకా జిల్లాలో ఎన్నో సమస్యలు ఉన్నాయని…వాటిపై మంగళవారం షర్మిల ఫీడ్ బ్యాక్ తీసుకుంటారని అనుచరులు చెప్తున్నారు.ఒక సోమవారం సైతం లోటస్‌పాండ్‌లో అభిమానుల కోలాహలం భారీగా కనిపించింది. తెలంగాణలోని పలు జిల్లాల నుంచి వైఎస్ అభిమానులు లోటస్ పాండ్‌కు తరలివచ్చి పార్టీ ఏర్పాటు చేయాలని షర్మిలను కోరారు. నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చిన అభిమానులు.. షర్మిల తెలంగాణ సిందూరం అంటూ బిరుదు ఇచ్చారు. చీర సారే బహుకరించారు. మరోవైపు పలువురు బుల్లితెర ఆర్టిస్టులు సైతం షర్మిలను కలిశారు. మహిళలు అన్నిరంగాల్లో రానిస్తున్నారని… తెలంగాణ రాజకీయాల్లో షర్మిల తనదైన ముద్ర వేసుకుంటుందని వారు తెలిపారు. అయితే రాజకీయంగా కాకుండా తమకున్న పరిచయంతో మాత్రమే కలిశామని..రాజకీయాలు ఆపాదించవద్దంటూ బుల్లితెర ఆర్టిస్టులు విజ్ఞప్తి చేశారు.మహబూబ్ నగర్ సమ్మేళనం తర్వాత ఆదిలాబాద్ లేదా నిజామాబాద్ జిల్లా అభిమానులతో షర్మిల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం ఈ అంశంపై రెండు జిల్లాల ముఖ్యనేతలతో షర్మిల సమీక్ష జరిపారు.