ఢిల్లీ, చెన్నై, ముంబై, హైదరాబాద్ సహా పలు నగరాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని చెప్పారు. లాక్ డౌన్ కు సంబంధించి ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కేసీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాజిటివ్, యాక్టివ్ కేసులు లేని జిల్లాలను ఆరంజ్, గ్రీన్ జోన్లుగా మార్చాలని సూచించారు. కరోనాకు వ్యాక్సిన్ ఇండియా నుంచే వచ్చే అవకాశం ఉందని కేసీఆర్ చెప్పారు. ఈ అంశానికి సంబంధించి హైదరాబాదులో ఉన్న కంపెనీలు కూడా కృషి చేస్తున్నాయని తెలిపారు. జూలై లేదా ఆగస్టు నెలల్లోనే వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని అన్నారు. వైద్య పరంగా సర్వ సన్నద్ధంగా ఉన్నామని… అవసరమైన మందులు, పీపీఈ కిట్లు, మాస్కులు, వైద్య పరికరాలు ఉన్నాయని చెప్పారు. కరోనా మనల్ని వదిలిపోయేట్టు లేదని… దానితో కలసి బతకడం తప్పదని అన్నారు. కరోనాతో కలిసి బతకడాన్ని అలవాటు చేసుకోవాలని చెప్పారు. వలస కూలీల కోసం శ్రామిక్ రైళ్లను వేయడం మంచి నిర్ణయమని కొనియాడారు.