తెరాస పార్టీ ఎంపీ కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి జీహెచ్ఎంసీ మేయర్గా ఎన్నికయ్యారు. ఆమె బంజారాహిల్స్ డివిజన్ నుంచి వరుసగా రెండోసారి కార్పొరేటర్ గా విజయం సాధించిన విషయం తెలిసిందే. నగరపాలక సభ్యులు ఆమెను ఎన్నుకున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. అలాగే డిప్యూటీ మేయర్గా మోతె శ్రీలత శోభన్రెడ్డిని సభ్యులు ఎన్నుకున్నారు. ఆమె తార్నాక నుంచి గెలుపొందారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను పీవో శ్వేతా మహంతి ప్రకటించారు.జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేపిన విషయం తెలిసిందే. బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఊహించని రీతిలో అధిక స్థానాల్లో గెలుపొందడం, ఏ పార్టీకీ పూర్తి స్థాయి మెజార్టీ రాకపోవడంతో దీనిపై కొన్ని రోజులుగా ఉత్కంఠ నెలకొంది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో టీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతు తెలిపింది. చివరికి టీఆర్ఎస్ మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను కైవసం చేసుకుంది. దీంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.