కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేశామని భావిస్తున్న వేళ చైనాలో మరో కొత్త సమస్య మొదలైంది. వివిధ దేశాల నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తున్న వారి కారణంగా మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. వారి వివరాలు అందిస్తే నజరానా అందిస్తామని ప్రకటించింది.దేశంలోని ఈశాన్య ప్రాంతమైన హిలోంగ్జియాంగ్ ప్రావిన్స్‌లోకి రష్యా నుంచి వచ్చిన వారిలో మంగళవారం కొత్తగా 79 కేసులు నమోదయ్యాయి. కేసుల నమోదుతో ఉలిక్కిపడిన అధికారులు వాటికి అడ్డుకట్ట వేసేందుకు సరిహద్దు వద్ద నిఘా పెంచారు. అయినప్పటికీ చొరబాట్లు ఆగకపోవడంతో అటువంటి వారి ఆచూకీ చెబితే ఒక్కొక్కరికీ 5 వేల యువాన్లు (రూ.54 వేలు) చొప్పున ఇస్తామని అధికారులు ప్రకటించారు. దేశంలోకి ప్రవేశించే వారిని పట్టుకుని పరీక్షలు చేస్తే పరిస్థితి మళ్లీ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు.