శంషాబాద్ మున్సిపాలిటికీ చెందిన ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కౌన్సిలర్లు 8 మంది, టీడీపీ సీనియర్ నేత గణేశ్ గుప్త టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో వారు టీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు. అనంతరం, కేటీఆర్ మాట్లాడుతూ, ఏ ఎన్నికలు అయినా ‘కారు’దే హవా అని అన్నారు. ఏ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచినా కాంగ్రెస్, బీజేపీలకు విమర్శించడం అలవాటైపోయిందని విమర్శించారు. ఈవీఎంలను ఏదో చేశారు కనుకనే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిందని విమర్శించారని, ఆ తర్వాత జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికలు, మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిందని, ఇప్పుడు ఆరోపణలు చేసేందుకు ఏమీ లేకపోవడంతో నోరెల్లబెడుతున్నారని ఆ రెండు పార్టీల నాయకులపై విమర్శలు చేశారు. కాంగ్రెస్, బీజేపీలు తమ సిద్ధాంతాలను పక్కనబెట్టి మున్సిపల్ ఎన్నికల్లో కుమ్మక్కయ్యాయని విమర్శించారు. సీఎం కేసీఆర్ పై ప్రజలకు నమ్మకం కుదిరిందని, అందుకే, ఏ ఎన్నికలో అయినా తమ పార్టీ గెలుస్తోందని అన్నారు.