ఇటీవలి కాలంలో కొందరు తన మతం, కులం గురించి మాట్లాడుతూ, దారుణమైన విమర్శలు చేస్తున్నారని, వాటిని వింటుంటే బాధగా ఉంటోందని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం గుంటూరులో ‘వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం జగన్ ప్రసంగించారు. “నేను ఒక్కటే చెప్పదలచుకున్నా. నా మతం మానవత్వం అని ఈ వేదికపై నుంచి చెప్పదలచుకున్నా. నా కులం మాట నిలబెట్టుకునే కులం అని ఈ వేదికపై నుంచి చెప్పదలచుకున్నా. ఇచ్చిన మాటకు కట్టుబడి వుండాలని పనిచేస్తున్నా” అని జగన్ అన్నారు. ఓ గొప్ప కార్యక్రమానికి నేడు అంకురార్పణ జరిగిందని, వైద్యం చేయించుకునేందుకు ఇకపై ఏ పేదవాడూ ఇబ్బందులు పడబోడని హామీ ఇస్తున్నానని అన్నారు. మనిషి ప్రాణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. కాగా, ఆరోగ్య శ్రీలో భాగంగా 26 విభాగాల్లో 836 శస్త్రచికిత్సలకు ఆర్థికసాయం వర్తించనుంది. శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకునే కాలంలోనూ ఆర్థికసాయం అందుతుంది. ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 150కి పైగా ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ పథకాన్ని అందిస్తాయని జగన్ గుర్తు చేశారు.