భారత దేశ ప్రధాని నరేంద్రమోదీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాప్యులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా సహా ప్రపంచ మీడియాలో నిన్నమొన్నటి వరకు ఆయన గ్రేట్ లీడర్‌గా వెలుగొందారు. అయితే, దేశంపై విరుచుకుపడిన కరోనా సెకండ్ వేవ్ మోదీ పేరుప్రతిష్ఠలను దారుణంగా దిగజార్చింది.గత మూడు దశాబ్దాల్లో ఏ భారత నాయకుడికి సాధ్యం కాని ఇమేజ్ను సొంతం చేసుకున్న మోదీ ప్రతిష్ఠ కరోనా దెబ్బకు అమాంతం మసకబారింది. అమెరికాకు చెందిన డేటా ఇంటెలిజెన్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్స్ చేసిన సర్వేలో మోదీ రేటింగ్ అత్యంత కనిష్ఠానికి పడిపోయినట్టు తేలింది.కరోనా వైరస్ కేసుల సంఖ్య 2.5 కోట్లు దాటడం ఆయన ప్రతిష్ఠను దారుణంగా దెబ్బతీసింది. దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విరుచుకుపడడానికి మోదీయే కారణమంటూ ఇటీవల గ్లోబల్ మీడియా కూడా దుమ్మెత్తి పోసింది.మార్నింగ్స్ కన్సల్ట్స్ అనేది ప్రపంచస్థాయి నేతల పాప్యులారిటీని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ నివేదికలు ఇస్తుంటుంది. తాజాగా అది వెల్లడించిన నివేదికలో ఈ వారం మోదీ ఓవరాల్ రేటింగ్ 63 శాతానికి పడిపోయింది. ఆగస్టు 2019లో తాము మోదీ పాప్యులారిటీని ట్రాక్ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆయనకు వచ్చిన అత్యంత కనిష్ఠ రేటింగ్ ఇదేనని ఆ సంస్థ పేర్కొంది.