నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు నేడు (బుధవారం) ఫోన్ చేశారు. ఈ ఫోన్ కాలే ఉక్రెయిన్ ఎడ్యుకేషనల్ హబ్‌గా ఉన్న ఖర్కివ్‌లోని భారత విద్యార్థులకు పొంచి ఉన్న ముప్పును వెల్లడించింది.
పుతిన్‌తో ఫోన్ సంభాషణ ముగించిన వెంటనే మోదీ విదేశాంగ శాఖ అధికారులను అలెర్ట్ చేశారు. ఖర్కివ్‌పై రష్యా దళాలు విరుచుకుపడనున్నాయని, వీలయినంత త్వరగా అక్కడి మన విద్యార్థులను బయటకు తీసుకెళ్లాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కారణంగానే నిమిషాల వ్యవధిలోనే ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం నుంచి ఖర్కివ్‌లోని భారత విద్యార్థులకు రెండు అడ్వైజరీలు జారీ అయ్యాయి.
పుతిన్‌కు ఫోన్ చేసిన మోదీ.. భారత విద్యార్థులను రష్యా మీదుగా తరలించాలని, విద్యార్థుల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని.. భారతీయులు సురక్షితంగా బయటకొచ్చేందుకు అవకాశం కల్పించాలని కోరారు. దీంతో ఖర్కివ్ నుంచి భారతీయులు వెళ్లేందుకు 6 గంటల పాటు వెసులుబాటు కల్పిస్తున్నట్లు పుతిన్ చెప్పారు.
ఉక్రెయిన్ కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల (భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9.30 గంటలు)లోగా ఖర్కివ్‌ను వదిలి వెళ్లేందుకు భారత విద్యార్థులకు గడువు చిక్కిందన్న మాట. ఈ కారణంగానే.. ఖర్కివ్‌ను వదిలి వెళ్లాలంటూ భారతీయులకు ఇండియన్ ఎంబసీ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.